సుప్రీంకోర్టులో భౌతిక విచారణ చేపట్టడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గురువారం రాత్రి నూతన ప్రామాణిక నిబంధనలు విడుదల చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఇటీవల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇకమీదట ప్రతి మంగళ, బుధ, గురువారాల్లో భౌతిక విచారణలు మాత్రమే చేపట్టనున్నట్లు రిజిస్ట్రీ పేర్కొంది. మంగళవారం లిస్ట్ చేసిన కేసులను భౌతికంగా విచారించనున్నప్పటికీ, న్యాయవాదులెవరైనా ఒకరోజు ముందు విజ్ఞప్తి చేసుకుంటే ఆరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానూ అనుమతిస్తారు. బుధ, గురువారాల్లో మాత్రం తప్పనిసరిగా భౌతికంగానే వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఈనెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
తదుపరి ఉత్తర్వుల వరకు ఇదే పద్ధతి..
- సోమవారం, శుక్రవారం లిస్ట్ అయ్యే అన్ని కేసులనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారిస్తారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పద్ధతి కొనసాగుతుంది.
- భౌతిక విచారణ చేపట్టేటప్పుడు కోర్టు గదుల్లో ధర్మాసనం విచక్షణాధికారం మేరకు ఒక్కోసారి 15 నిమిషాలపాటు విరామం ఇస్తారు. ఆ సమయంలో కోర్టు గదులు శానిటైజ్ చేస్తారు.
- మంగళ, బుధ, గురువారాల్లో లిస్ట్ చేసిన ఏ కేసులోనైనా వాదనలు వినిపించాల్సిన న్యాయవాదుల సంఖ్య కోర్టు గది సామర్థ్యం కంటే ఎక్కువ ఉంటే వాటిని వీడియో కాన్ఫరెన్స్/ హైబ్రిడ్ విధానం ద్వారా విచారించడానికి కోర్టు రిజిస్ట్రీ అనుమతిస్తుంది.
- భౌతిక విచారణ సమయంలో అడ్వొకేట్ ఆన్ రికార్డ్/ నామినీ, వాదనలు వినిపించే లాయర్, ఒక జూనియర్ లాయర్, ఒక అడ్వొకేట్ క్లర్క్‌ను మాత్రమే అనుమతిస్తారు.
- భౌతిక విచారణకు వచ్చే న్యాయవాదులను హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి ప్రాక్సిమిటీ కార్డు, ఫొటోతో కూడిన అనుమతి పత్రం ద్వారా మాత్రమే అనుమతిస్తారు. ‘పార్టీ ఇన్ పర్సన్’ అయితే ఇదివరకటి మాదిరిగానే భద్రత విభాగంలో ఫొటోతో కూడిన అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది.
- వాదనలు పూర్తయిన వెంటనే న్యాయవాదులు కోర్టు గదులు ఖాళీచేసి తర్వాతి కేసుల వారికి స్థలం కేటాయించాలి.
- న్యాయవాదులు ఎవరైనా వీడియో, టెలి కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించాలనుకుంటే అలాంటివారి కోసం సుప్రీంకోర్టు అదనపు భవనంలో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: