నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా వెనకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని సుప్రీంకోర్టుకు(Supreme court on neet reservation) కేంద్రం గురువారం తెలిపింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్ కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారిని గుర్తించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి, నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనానికి తుషార్ మెహతా తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గుర్తింపుపై ప్యానెల్ నివేదిక వచ్చే వరకు నాలుగు వారాలపాటు నీట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తామని చెప్పారు.
అఖిల భారత కోటాలోకి వచ్చే సీట్లలో ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం రిజర్వేషన్లను వర్తింపజేయనున్నట్లు కేంద్రం జులై 29న ఉత్తర్వులు(Neet reservation criteria 2021) జారీ చేసింది. దీనిపై కేంద్రాన్ని, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. నీట్ పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది.
ఈడబ్ల్యూఎస్ కోటా శక్తిమంతమైన, ప్రగతిశీల రిజర్వేషన్ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రానికి అన్ని రాష్ట్రాలు మద్దతు తెలపాలని అన్నారు. అయితే.. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వర్గీకరణ మాత్రం శాస్త్రీయమైన పద్ధతిలో జరగాలని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం పునరాలోచిస్తానని చెప్పడాన్ని ప్రశంసించింది.
సుదీర్ఘ వాదనలు..
పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్.. ఇప్పటికే చాలా సమయం గడిచినందున.. ఈడబ్ల్యూఎస్ కోటాను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని చెప్పారు. ప్రస్తుత ఏడాది కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం... ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరానికి రాజ్యాంగ సవరణ చేసి, ప్రస్తుత విద్యాసంవత్సర కౌన్సెలింగ్‌కు అనుమతించవచ్చా అని మెహతాను ప్రశ్నించింది.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈడబ్ల్యూఎస్ కోటా వర్తించేలా.. 103వ రాజ్యాంగ సవరణను అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మెహతా కోర్టుకు తెలిపారు. దీన్ని వాయిదా వేయడం సరైన చర్య కాదని నివేదించారు. ఈడబ్ల్యూఎస్ గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ నాలుగు వారాల కంటే ముందుగానే పూర్తయితే తాము కోర్టుకు తెలియజేస్తామని చెప్పారు.
ఈడబ్ల్యూఎస్ గుర్తింపునకు నాలుగు వారాల గడవు సరైనదేనని ధర్మాసనం తెలిపింది. తాము ఈ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావించట్లేదని చెప్పింది. అలా చేస్తే... అశాస్త్రీయంగా ఈడబ్ల్యూఎస్ కోటా వర్గీకరణ జరుగుతుందని పేర్కొంది. ఈ కేసును వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'ఇద్దరి కోసం మళ్లీ నీట్ నిర్వహించాలని ఆదేశించలేం'