ఉత్తర్‌ప్రదేశ్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసే విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నప్పుడు అధికారులు ప్రతి విషయంలో పారదర్శకంగా ఉండాలని, చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అధికారిక న్యాయ ప్రక్రియను పూర్తి చేశాకే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దేశంలో చట్టబద్ధమైన పాలన సాగుతోందనే భావన ప్రజల్లో ఉండాలని ఈ సందర్భంగా జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన ధర్మానసం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసింది. అప్పటివరకు చట్ట విరుద్ధంగా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని అధికారులకు సూచించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల చెలరేగిన అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. ఇది చట్టవిరుద్ధమని జామియత్ ఐ హింద్‌తో పాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుల ఇళ్లను కూల్చకుండా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వీటిని విచారించిన అత్యున్నత ధర్మాసనం మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని యూపీ సర్కార్‌ను ఆదేశించింది.
ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా, కాన్పుర్, ప్రయాగ్‌రాజ్ అధికారుల తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. చట్టప్రకారమే కూల్చివేతలు జరిగాయని, 2020 ఆగస్టులోనే వారి ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు.
ఇంట్లో ఉన్నవాళ్లు ఖాళీ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండానే కూల్చివేతలు జరుగుతున్నాయని జామియత్ ఈ హింద్ తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవిలో ఉన్న సీఎం సహా ముఖ్య అధికారులు నిందితుల ఇళ్ల కూల్చివేతపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రూ.500 కొడితే 2500.. ఆ ఏటీఎంకు ఎగబడ్డ జనం!