ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్‌ఖడ్‌కు మద్దతు కూడగట్టేందుకు భాజపా ప్రయత్నాలు మొదలుపెట్టింది. రైతు బిడ్డ అయిన ధన్‌ఖడ్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విపక్షాలను కోరారు. రైతు బిడ్డ అయిన ధన్‌ఖడ్ వ్యవసాయ నేపథ్యం నుంచి కష్టపడి ఎదిగారన్నారు. వేర్వేరు హోదాల్లో పనిచేసి గత మూడు దశాబ్దాలుగా దేశానికి సేవలందిస్తున్నారని.. గొప్ప పరిపాలకుడిగా, సమర్థవంతమైన రాజకీయ నేతగా విజయవంతమయ్యారన్నారు. ఆయనకు అన్ని పార్టీలూ మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వాను బరిలో దించాలని నిర్ణయించిన రోజే ఆయన విపక్షాల మద్దతు కోరడం గమనార్హం.
మరోవైపు, ధన్‌ఖడ్ ఎన్నిక దాదాపుగా లాంఛనమనే చెప్పాలి. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో భాజపాకు మెజార్టీ ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం పార్లమెంటులో సభ్యుల సంఖ్య 780 కాగా.. భాజపాకు సొంతంగా 394 మంది ఎంపీలు ఉన్నారు. అవసరమైన మెజార్టీ (390) కన్నా ఈ సంఖ్య ఎక్కువే.
ఇవీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం.. ఎన్డీఏకే విజయావకాశాలు