21వ శతాబ్దపు భారతదేశం పూర్తిగా మారిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటీ ఖరగ్‌పుర్ 66వ స్నాతకోత్సవానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండిజీనియస్ టెక్నాలజీ(స్వదేశీ సాంకేతిక సంస్థ) అని పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఆత్మవిశ్వాసం, నిస్వార్థత, స్వీయ అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
"భారత్‌లోని 130 కోట్ల ప్రజల ఆకాంక్షలకు మీరు(విద్యార్థులు) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మీరు అంకురాలుగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం, నిస్వార్థత, స్వీయ అవగాహన.. ఈ మూడు విషయాలపై మీరు దృష్టిసారించాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఉత్తరాఖండ్ జలప్రళయం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. విపత్తు నిర్వహణకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టిసారించాలని అన్నారు. కరోనా సమయంలో ఐఐటీలు అభివృద్ధి చేసిన సాంకేతికత.. వైరస్‌పై పోరాడేందుకు ఉపయోగపడిందని చెప్పారు.
ఇదీ చదవండి: 'ఆరోగ్య భారత్‌కు నాలుగు సూత్రాలు'