Sterilization on pretext of vaccination: కొవిడ్ టీకాను దేశప్రజలకు ప్రభుత్వం ఉచితంగానే అందిస్తోంది. అయితే.. ఈ విషయంపై అవగాహన లేనివారిని ఆసరాగా చేసుకుని కొంతమంది దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్‌లోనూ ఇలా టీకా పేరు చెప్పి ఓ వ్యక్తికి తీరని నష్టం చేకూర్చాడు ఓ దుండగుడు. కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తానని చెప్పి, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించాడు. పైగా ఇందుకోసం రూ.2,000 కూడా తీసుకున్నాడు.
అసలేమైందంటే..?
Rajastan udaipur vaccine sterilisation: ఉదయ్‌పుర్ జిల్లా ప్రతాప్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ కైలాశ్ పుత్ర బాబూలాల్.. కూలీ పనులు చేస్తూ బతుకు సాగిస్తున్నాడు. డిసెంబరు 29న ఉదయం.. కూలీకి వెళ్లేందుకు బేకనీ కల్వర్ట్ వద్ద నిల్చున్నాడు. ఆ సమయంలో సెక్టార్ 5 ప్రాంతానికి చెందిన నరేశ్ అనే వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. కైలాశ్‌కు రూ.2,000 ఇస్తే కరోనా టీకా వేయిస్తానని చెప్పి.. స్కూటీ మీద పులాలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి కైలాశ్‌కు టీకా ఇచ్చాడు. దాంతో అతడు వెంటనే మూర్ఛపోయాడు. ఆ తర్వాత అతనికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సను నిర్వహించారు. తర్వాత కైలాశ్‌ను నిందితుడు తన సోదరి ఇంటి వద్ద వదిలి పరారయ్యాడు. దీనిపై భుపాల్పుర పోలీస్ స్టేషన్లో కైలాశ్ ఫిర్యాదు చేశాడు.
Covid vaccine fraud: తమ కుమారుడికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయడంపై కైలాశ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కైలాశ్ ఒక్కడే కుమారుడు ఉన్నాడని.. అతనికి పెళ్లైనా ఇంకా సంతానం లేదని అతని తల్లి వాపోయింది. ఇంతలోనే కైలాశ్‌కు ఇలా అన్యాయం చేశారని రోదించింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 14 ఏళ్ల దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్.. 60 ఏళ్ల వృద్ధుడు కూడా...
ఇదీ చూడండి: భారీ కొండ విరిగిపడి నలుగురు దుర్మరణం- శిథిలాల కింద..