జమ్ముకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 2021- జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్ధీకరణ సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. దీనిపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన హోం మంత్రి అమిత్ షా.. ఈ బిల్లుకు అర్ధం జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వకపోవడం కాదని స్పష్టతనిచ్చారు.
"జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్ధీకరణ సవరణ బిల్లు తీసుకురావడం అంటే అర్ధం.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా రాకపోవడమే అని కొందరు సభ్యులు అన్నారు. బిల్లు ప్రక్రియకు నేను నాయకత్వం వహిస్తున్నాను. నేనే బిల్లును తీసుకువస్తున్నాను. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా రాదని ఈ బిల్లులో ఎక్కడా రాసిలేదన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. మీరు(కొందరు సభ్యులు) ఏ సమాచారం ఆధారంగా ఈ మాట అంటారు. మీ మనసులోని అనుమానాలను జమ్ముకశ్మీర్ ప్రజలపైకి ఎందుకు వదులుతారు. జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్ధీకరణ సవరణ బిల్లుతో జమ్ముకశ్మీర్ రాష్ట్రహోదా అంశానికి ఎలాంటి సంబంధం లేదని నేను ఇదే సభలో చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. సరైన సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది."
--అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత 17నెలల్లో జమ్ముకశ్మీర్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించిన విపక్షాలకు సమాధానమిచ్చిన అమిత్ షా.. 12నెలలు కరోనా ఉందని తెలిపారు. 17నెలల అభివృద్ధి గురించి అడుగుతున్న కాంగ్రెస్... 70ఏళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధిపై వివరించాలని సవాల్ విసిరారు.
ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల్లో అవినీతి జరిగిందన్న విపక్షాలను అమిత్ షా తోసిపుచ్చారు. ఎన్నికల్లో ఎలాంటి అవినీతి, హింస జరగలేదని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో ఓటు వేశారని వెల్లడించారు. తమ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈ విషయాన్ని కాదనలేరని అన్నారు. విపక్షాలు తమ అనుమానాలను జమ్ముకశ్మీర్ ప్రజలపైకి రుద్దరాదని అమిత్ షా సూచించారు.
ఇదీ చదవండి:ఆ ఐదు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సాయం