పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసింది. కార్యాలయాల్లో అండర్ సెక్రటరీ, అంతకంటే తక్కువ స్థాయి అధికారుల్లో 50 శాతానికి మించి విధులకు హాజరుకావొద్దని ఆదేశించింది. డిప్యూటీ సెక్రటరీ, అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులు రోజూ కార్యాలయానికి హాజరుకావాలని స్పష్టం చేసింది.
వీరంతా వేర్వేరు సమయాల్లో ఆఫీసుల్లో విధులు చేపట్టాలని మార్గదర్శకాల్లో వివరించింది కేంద్రం. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయన్న సిబ్బంది వ్యవహారాల శాఖ.. ఈనెల 30 వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దివ్యాంగులు, ప్రసూతి మహిళా ఉద్యోగులను ఈ నిబంధనల నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపింది. వారు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని పేర్కొంది.
ఇదీ చూడండి: 'రెమిడెసివిర్‌ను బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలే'