ప్రతిరోజూ 10 కిలోమీటర్లు కాలినడకనే బడికి వెళ్తాడు కృష్ణకుమార్. మౌగంజ్‌లోని ఉత్కృష్ట్ విద్యాలయలో చదువుకుంటున్న కృష్ణ.. ఉత్తమ మార్కులు సాధించిన మొదటి పది మంది విద్యార్థుల్లో ఒకడిగా నిలిచాడు. విధినీ, వైకల్యాన్నీ ఎదిరించి, పాదాలతోనే పెన్ను పట్టుకుని అక్షరాలను అందంగా రాస్తాడు. 12వ తరగతిలో టాపర్‌గా నిలిచి, తానేంటో రాష్ట్రానికి చూపించాడు.
పుట్టుకతోనే..
కృష్ణకుమార్‌కు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. తోబుట్టువుల సాయంతో నడక నేర్చుకున్న కృష్ణ.. కష్టపడి చదవడం అలవాటు చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచీ కాళ్లతోనే పనులన్నీ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఏ పని చేసినా వంద శాతం శ్రద్ధ పెట్టి, పట్టుదలతో చేసేవాడు కృష్ణ. హర్జాయ్ ముధాన్ గ్రామానికి చెందిన కృష్ణకుమార్ సాధించిన విజయం పట్ల ఊరి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుమారుడి నైపుణ్యాలు చూసి పొంగిపోతున్న కృష్ణకుమార్ తండ్రి.. ఉన్నత చదువులు చదివించలేని తన నిస్సహాయతకు కుంగిపోని క్షణం లేదు.
"కలెక్టర్ కావాలన్నది నా కల. కానీ.. నన్ను పై చదువులు చదివించే స్తోమత మా నాన్నకు లేదు. నా చదువు కోసం ఆయనేమీ చేయలేకపోతున్నారు. ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను."
- కృష్ణ కుమార్, విద్యార్థి
ఉపాధ్యాయుల మెప్పు..
కృష్ణకుమార్ ప్రతిభను చూసి, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటారు. మట్టిలో మాణిక్యం అంటూ కృష్మకుమార్ను కొనియాడుతున్నారు.
"మాకు కృష్ణను చూస్తే గర్వంగా ఉంటుంది. చేతుల్లేకున్నా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఆ కుర్రాడిని ప్రశంసించకుండా ఉండలేం. చదువుల్లో చురుగ్గా ఉంటాడు."
- విష్ణుకుమార్ శుక్లా, ఉపాధ్యాయుడు
నాడు బాధపడినవారి కళ్లలోనే నేడు ఆనందం..
కృష్ణకుమార్‌ది బీద కుటుంబం. ముగ్గురు తోబుట్టువులు. ఇంటిని నెట్టుకొచ్చేందుకు కూలీ పనులు చేస్తున్నారు తల్లిదండ్రులు. ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేదు. కానీ.. ఇవేవీ తన చదువుకు అడ్డు పడనీయలేదు కృష్ణకుమార్. పూర్తి శ్రద్ధ పెట్టి, కష్టపడి చదువుతాడు. కృష్ణకుమార్ చేతుల్లేకుండా పుట్టినప్పుడు బాధపడ్డ తల్లిదండ్రులు.. ప్రస్తుతం తమ కుమారుడ్ని చూస్తే గర్వంగా అనిపిస్తుందని చెప్తున్నారు. కలెక్టర్ అయి, కుటుంబానికి అండగా నిలవాలని కలలు కంటున్నాడు కృష్ణ.
"కష్టానికి దక్కిన ప్రతిఫలమిది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. సరైన ఇల్లు కూడా లేక నానా అవస్థలు పడుతున్నాం. ఎక్కడికెళ్లినా నడుచుకుంటూనే వెళ్తాం. ఇంటిముందున్న మురికి కాలువ నుంచి నీరంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ మాకూ లేదు. ఎవరో ఒకరు సాయం చేస్తే బాగుంటుంది. నా బిడ్డలకు ఎవరైనా సహాయం చేయాలి."
- రామ్జాస్ కుమార్, కృష్ణకుమార్ తండ్రి
కృష్ణకుమార్ బాగా చదువుకుని, తమ కష్టాలు తీరుస్తాడని ఆశలు పెట్టుకున్నారు అతడి కుటుంబ సభ్యులు. కృష్ణ ప్రతిభ గురించి తెలుసుకుని, కొందరు సామాజిక కార్యకర్తలు ఆర్థిక సాయం చేశారు. జిల్లాకు చెందిన మరి కొంతమంది చదువు కోసం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: కళ్లు లేకపోయినా 40 ఏళ్లుగా మిల్లు నడుపుతూ..