కాలం ఎన్నో అవకాశాలకు మార్గం చూపిస్తుంది. వైకల్యం భవిష్యత్తును చిధ్రం చేసిందని భావిస్తే ముందుకెళ్లలేం. జీవితంలో విజయాలు సాధించలేము. మనలోని కళను గుర్తించినప్పుడే.. కలల సౌధాన్ని నిర్మించుకోవచ్చని నిరూపించారు ఓ కళాకారుడు. వైకల్యం అడ్డొచ్చినా.. చిత్రలేఖనంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ విజయ గాథను ఇప్పుడు చూద్దాం.
డౌన్ సిండ్రోమ్‌తో పుట్టిన కిరణ్ తనదైన రంగుల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్నారు. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన ఆయన వైకల్యాన్నిఅధిగమించి చిత్ర లేఖనాన్ని ఉపాధిగా మలుచుకున్నారు. జీవితంలో ఏదోఒకటి సాధించాలనే సంకల్పమే అతన్ని కుంచె పట్టెలా చేసింది. ఎన్నో చిత్రాలకు రంగులద్దిన కిరణ్ మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
కిరణ్ కుంచె పడితే.. ఆ బొమ్మల్లో చిత్ర సరస్వతి తొణికిసలాడుతుంది. వాటినే తదేకంగా చూస్తే మనతో ఏదో చెబుతున్నట్లు భ్రమ కలుగుతుంది. తన 8 ఏళ్ల ప్రస్థానంలో ఆయన కదిపిన కుంచె ఎన్నో బొమ్మలకు ప్రాణం పోసింది. ఆది దంపతులు పార్వతి పరమేశ్వరుల చిత్రం కిరణ్ కళా తృష్ణకు ఓ నిదర్శనం. జ్ఞాన ముద్రలోని గౌతమ బుద్ధుడి చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేవతా మూర్తులే కాకుండా ఆయన చిత్ర కళలో.. సామాజిక స్ఫృహ కూడా ఓ భాగం. చేతివృత్తులు, చుట్టూ పరిసరాల్లో జరిగే సంఘటనలు.. కిరణ్ చిత్రలేఖనంలో ఆవిష్కృతమై ఉన్నాయి.
కిరణ్ వేసే చిత్రాలకు కర్ణాటక వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన పెయింటింగ్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. చిత్రలేఖనంలో కిరణ్ ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. 2020 ఏడాదికి గాను రాష్ట్ర స్థాయిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ బహుమతి సాధించారు. పీఆర్ తిప్పస్వామి ఆర్ట్ అవార్డును కూడా ఆయన గెలుచుకున్నారు.
ఇదీ చూడండి: పులి దాడి నుంచి యజమానిని కాపాడిన గేదెలు