దేశంలో మరికొన్ని రోజుల పాటు వర్షాకాలం (Monsoon in India) కొనసాగుతుందని వాతావరణ శాఖ (IMD weather forecast) అంచనా వేసింది. వాయవ్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు (Monsoon in India) తిరోగమనం చెందకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. సెప్టెంబరు చివరి వరకు వర్షాలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేసింది. వరుసగా ఐదు రోజుల పాటు ఎలాంటి వర్షాలు నమోదు కాకుంటే వాయవ్య రాష్ట్రాల్లో రుతుపవనాలు తిరోగమనం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
'మరో 10 రోజుల పాటు వాయవ్య రాష్ట్రాల్లో రుతుపవనాలు వెనక్కి వెళ్లే సూచనలు కనిపించట్లేదు' అని అన్నారు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర.
నైరుతి రుతుపవనాల తిరోగమనం (Monsoon in India).. పశ్చిమ రాజస్థాన్ నుంచి ప్రారంభం అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తాజాగా శుక్రవారం నుంచి జైసల్మేర్ వద్ద తిరోగమనం ప్రారంభం అవుతుందని పేర్కొంది.
1964 తర్వాత ఇదే తొలిసారి..
ఈ ఏడాది దిల్లీలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నాటికి అత్యధికంగా 1159.4 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం 1964 తర్వాత ఇదే తొలిసారని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నెలలో దిల్లీలో అత్యధికంగా 403 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు నెలలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం 1944 తర్వాత ఇదే తొలిసారి.
ఇదీ చూడండి : 'వచ్చే ఏడాది రిపబ్లిక్ డే పరేడ్.. సెంట్రల్ విస్టా అవెన్యూలోనే'