national herald case ed: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మూడు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. విచారణలో అన్ని విషయాలు చెప్పనున్నట్లు సమాచారం. మరోవైపు.. ఈనెల 13న ఈడీ విచారణకు హజరుకావాలని కాంగ్రెస్ నేత, సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే విషయంపై చర్చించేందుకు గురువారం కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనునుంది. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులందరినీ పిలిచినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ హాజరు అంశంపై చర్చించనున్నారు. రాహుల్ ఈడీ ఎదుట విచారణకు హాజరైన రోజు.. దేశ వ్యాప్తంగా భారీగా నిరసన కార్యక్రమాలను నిర్వహించే యోచనలో ఉంది కాంగ్రెస్. సోనియా, రాహుల్ ఈడీ విచారణకు హాజరు అయ్యే అంశంపై మంగళవారం పార్టీ సినియర్ నేతలు చర్చించినట్లు ఏఐసిసి వర్గాల వెల్లడించాయి. గురువారం వర్చువల్‌గా జరిగే భేటీలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులు కూడా హాజరు కావాలని ఏఐసీసీ ఆదేశించింది.
నేషనల్ హెరాల్డ్ కేసు ఇదే: కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.
ఇదీ చదవండి: 'విచారణకు హాజరు కాలేను'.. ఈడీకి సోనియా లేఖ