దేశ రాజధానిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Cwc Congress) సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలతో పాటు దేశంలోని అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi News) మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మూడు నల్ల చట్టాలను పార్లమెంట్ ఆమోదించి ఏడాదైంది. రైతులు, రైతు సంఘాల ఆందోళన కొనసాగుతోంది. కొన్ని ప్రైవేటు సంస్థల ప్రయోజనానికే ఈ మూడు నల్లచట్టాలు (Farm Bills) తీసుకొచ్చారు. నల్ల చట్టాల ఆమోదానికి అందరినీ నరకయాతన పెట్టారు. నిరసనలతో రైతులు ఎంతో నష్టపోయారు. లఖింపుర్ ఖేరీ ఘటన భాజపా మనస్తత్వాన్ని బయటపెట్టింది. రైతుల పట్ల భాజపాకు ఎలాంటి ఆలోచన ఉందో దీనిద్వారా తెలిసింది' అన్నారు.
రక్షిస్తున్నామంటూ ప్రమాదంలోకి నెడుతున్నారు..
'దేశ ఆర్థిక పరిస్థితి (Indian Economy) చాలా ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి చర్యలు తీసుకోవట్లేదు. దశాబ్దాల కాలంగా నిర్మించిన ఆస్తులను అమ్మేస్తున్నారు. ఆర్థిక పునరుద్ధరణకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల సాధికారత ప్రమాదంలో పడింది. రక్షిస్తున్నామనే పేరుతో మరింత ప్రమాదంలోకి నెడుతున్నారు' అని సోనియా ఆరోపించారు.
ప్రధాని మౌనం.. దేశాన్ని నష్టపరుస్తోంది
'పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేశారు. ప్రజల జీవితాన్ని భరించలేనంతగా మారుస్తున్నారు. రాష్ట్రాల డిమాండ్‌తోనే టీకా సేకరణలో కేంద్రం మార్పులు చేసింది. మైనార్టీలే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న హత్యలను ఖండిస్తున్నాం. అనాగరిక నేరాలకు పాల్పడిన వారిని కేంద్రం శిక్షించాలి. పొరుగు దేశాలతో అనుసరించే విధానంలో ప్రతిపక్షాలను పట్టించుకోవట్లేదు. సరిహద్దుల్లో, ఇతర రంగాల్లో దేశం సవాళ్లను ఎదుర్కొంటోంది. చైనా ఎలాంటి ఆక్రమణ చేయలేదని గతంలో ప్రధాని మోదీ చెప్పారు. ప్రధాని మౌనం.. దేశాన్ని తీవ్రంగా నష్టపరుస్తోంది' అని అన్నారు.
జీ23 నేతలకు చురకలు
కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు, సంస్థాగత ప్రక్షాళనపై కొందరు పార్టీ సీనియర్లు (G23 Congress) గళంవిప్పుతున్న వేళ వారికి సోనియా చురకలంటించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) భేటీ వేదికగా వారికి తన వైఖరిని తేల్చి చెప్పారు. పార్టీలో తాను తాత్కాలిక అధ్యక్షురాలిని కాదని.. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తునున్నట్టు చెప్పారు. పార్టీ విషయాలపై నేతలెవరైనా మీడియా ద్వారా కాకుండా నేరుగా తనతోనే మాట్లాడాలని సూచించారు.
'పార్టీ పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఐక్యంగా, క్రమశిక్షణతో పనిచేస్తేనే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ పునరుద్ధరణ, పునరుత్తేజం కావాలి. సంస్థాగత ఎన్నికల విషయంలో కలిసికట్టుగా నడవాలి. పార్టీలో స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ అవసరం. పార్టీ అధ్యక్ష, సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి. పార్టీ అధ్యక్షురాలిగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నా. భావసారూప్యత కలిగిన పార్టీలతో నిత్యం సంప్రదింపులు చేస్తున్నాం. ఇప్పటికే జాతీయ సమస్యలపై ఉమ్మడి ప్రకటన చేశాం. ఎవరైనా.. ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా చెప్పొచ్చు. మీడియా ద్వారా మాట్లాడాల్సిన అవసరంలేదు. అందరం స్వేచ్ఛగా, నిజాయతీగా చర్చించుకుందాం. సీడబ్ల్యూసీ (CWC Congress) సమష్టి నిర్ణయాలనే బయటకు చెప్పాలి. చర్చించిన ప్రతి అంశాన్నీ బయటచెప్పాల్సిన అవసరం లేదు' అని నేతలకు దిశానిర్దేశం చేశారు.
సెప్టెంబర్‌లోగా సంస్థాగత ఎన్నికలు!
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. 2022 సెప్టెంబర్ వరకు సంస్థాగత ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. సంస్థాగత ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగనున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి: కాంగ్రెస్ పార్టీకి నేనే ఫుల్‌టైమ్ అధ్యక్షురాలిని: సోనియా