పాముకాటుకు గురైన తన మనవడితో పాటు అతడిని కాటేసిన సర్పాన్ని పట్టుకొని ఆస్పత్రికి తీసుకెళ్లాడు ఓ వృద్ధుడు. బిహార్‌లో ఈ ఘటన జరిగింది. మనవడి ప్రాణాలు కాపాడేందుకు సాహసం చేసి మరీ.. పామును పట్టుకున్నాడు ఆ వృద్ధుడు. ఆస్పత్రికి పామును తీసుకురావడాన్ని చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. వెంటనే చిన్నారికి చికిత్స చేయడం ప్రారంభించారు.
త్రివేణిగంజ్‌లోని కఠ్ఖోల్వాలో నివసిస్తున్న శాంతి దేవి మనవడు ఉత్తమ్ ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఇంతలో బాలుడి కాలుపై విషసర్పం కాటు వేసింది. ఉత్తమ్ ఏడవటం చూసిన అతడి తాత.. ఏమైందా అని మనవడి దగ్గరకు వెళ్లాడు. ఇంతలో అటుగా వెళ్తున్న పామును చూశాడు. మనవడి కాలుపై పాము కాటును చూసి వెంటనే ధైర్యం చేసి పామును పట్టుకొని ఒక డబ్బాలో వేశాడు. తాత ఆ పాముతో పాటు మనవడిని త్రివేణిగంజ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
డబ్బాలో ఉన్న పామును చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ సర్పాన్ని చూపిస్తూ.. తన మనవడిని కాటేసిన పాము ఇదేనంటూ వైద్యులు చెప్పాడు. శాంతి దేవి కూడా తన మనవడి కాలుపై పాము కాటు ఉన్నట్లు తెలిపింది. వెంటనే వైద్యులు బాలుడికి చికిత్స అందించటం ప్రారంభించారు. గంటన్నర తరవాత కూడా బాలుడిలో ఎటువంటి పాముకాటు లక్షణాలు లేవని డాక్టర్ ఉమేశ్ కుమార్ తెలిపారు. మనవడి ప్రాణాలు కాపాడటం కోసం విషసర్పాన్ని పట్టుకున్న తాత విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
నిర్లక్ష్యంగా పాముతో ఆటలు..
కాగా, ఇటీవల ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా పాముతో ఆటలాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో సర్పాన్ని పట్టుకోగా.. పాము అతడిపై కాటు వేసింది. తన చేతిలో గరుడ రేఖ ఉందని చెబుతూ పాముతో ఆటలాడాడు ఆ వ్యక్తి. కాటేసిన తర్వాత పాము అతడి చేతిలో నుంచి జారిపోయింది. దీంతో పామును మళ్లీ పట్టుకున్నాడు. ఈ క్రమంలో నాలుగుసార్లు పాము కాటేసింది. దీంతో అతడు కుప్పకూలాడు. అతడు మరణించాడని అందరూ భావించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు సైతం చేశారు. ఆ తర్వాత జరిగిన ఘటనను చూసి అంతా షాక్ అయ్యారు. అప్పుడు ఏమైందో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.