Skill Development Case Chandrababu Bail Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు రానుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించనుంది. బెయిల్ పిటిషన్‌పై ఇటీవలే వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయావాది సిద్దార్థ లూథ్రా (Sidharth Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు ఉండగా.. పూర్తి స్థాయి బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 15వ తేదీన వాదనలు జరిగాయి. కానీ ఆరోజు పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. వాదనలు ఆరోజు పూర్తి కావడంతో వాయిదా వేసిన న్యాయస్థానం.. దీనిపై ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇవ్వనుంది.
'ఎన్నికల వేళ తప్పుడు కేసులు - రాజకీయ పెద్దలు చెప్పినట్లు సీఐడీ నడుస్తోంది'
అయితే వాదనలు సందర్భంగా.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని సిద్ధార్థ లూథ్రా అన్నారు. ఈ కేసులో చంద్రబాబును ప్రశ్నించేందుకు సీఐడీ (CID) ప్రయత్నం చేయలేదని.. నిందితులంతా ఇప్పటికే బెయిలు పొందారని తెలిపారు. ఏపీ సీఐడీ రాజకీయ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటోందని పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి కానీ రాజకీయ నాయకులకు కాదని పేర్కొన్నారు.
రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశారని.. బెయిలు మంజూరు చేయాలని కోరారు. 35వ నిందితుడిగా ఉన్న వ్యక్తికి హైకోర్టు బెయిలు నిరాకరించిందని మాత్రమే చెబుతున్నారని.. కానీ సుప్రీంకోర్టు బెయిలు ఇచ్చిన విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారనన్నారు. కేసు వివరాలను ఇప్పటికే సీఐడీ ఆధీనంలో ఉన్నాయని.. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబును కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని వాదించారు.
అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు
పొన్నవోలు వాదనలు సందర్భంగా.. చంద్రబాబు వైద్య నివేదికలు నమ్మశక్యంగా లేవని.. బెయిలు మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదంటూ వాదించారు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలని అన్నారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిలు వచ్చిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిలు ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదన్నారు. దీంతో బెయిలు పిటిషన్‌ను కొట్టేయాలి’ అని కోరారు.
బెయిలు మంజూరు వైద్యులు ఇచ్చిన వైద్య నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. వాస్తవాలను దాచిపెట్టి ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తూ.. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇరువైవు వాదనలు పూర్తి అవ్వడంతో.. 16వ తేదీన తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ఈరోజు దీనిపై తీర్పు వెల్లడించనుంది.
ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ - తీవ్ర ఉత్కంఠ