Silk Saree to Ayodhya Ram Mandir From AP : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తోంది. భక్తులు కూడా శక్తికి తగ్గట్లుగా కానుకలు సమర్పించుకుంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కుటుంబాలు, సీతమ్మ కోసం సిద్ధం చేసిన చీర ప్రత్యేకంగా నిలుస్తోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో 4 నెలల పాటు నేసిన ఆ పట్టు చీర విశేషాలేంటో చూసేద్దాం.
సీతమ్మ కోసం భారీ పట్టు చీర : అయోధ్యలో ఈ నెల 22న రామమందిరంలో సీతారాములను ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi )చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. శ్రీరాముడు, సీతమ్మ కోసం దేశ వ్యాప్తంగా అనేక మంది తమ శక్తి కొద్దీ బహుమతులు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన రెండు చేనేత కుటుంబాలు సీతమ్మ కోసం భారీ పట్టు చీరను చేనేత మగ్గంపై నేశారు.
శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అంతా రెడీ- నిత్య క్రతువుల షెడ్యూల్ ఇదే
చీరను నాగరాజు డిజైన్ చేయగా, సురేంద్రనాథ్, ఆయన కుమారుడు తేజ మగ్గంపై నేశారు. పట్టు చీరను బహూకరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని, చేనేత కుటుంబాలు చెబుతున్నాయి.
"మా పూర్వీకుల నుంచి మేము చేనేత వృత్తిలోని బతుకుతున్నాము. రాముల వారికి మా నుంచి ఏమైనా ఇవ్వాలని అనుకున్నాము. అందులో భాగంగానే అయోధ్య రామామందిరానికి బహుకరించడానికి రామాయాణంలోని ఘట్టాలను తీసుకుని చిత్రాలను దీనిపై నేశాను. దీనిని తయారు చేయడానికి నాకు నాలుగు నెల సమయం పట్టింది." -నాగరాజు, పట్టు చీర డిజైన్ చేసిన నిపుణుడు
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ధోనీకి ఆహ్వానం - అయోధ్యకు వెళ్లనున్న ఆశా భోస్లే
"మేము అయోధ్యకు పట్టు చీర తయారు చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని తయారు చేశాము. నాగరాజు దీనిని డిజైన్ చేశారు. మేము దీనిని తయారు చేశాము. పిల్లలకు అర్థమయ్యేలాగా చీరను తయారు చేశాము." - నాగేంద్రనాథ్, చేనేత కార్మికుడు
సీతమ్మ కోసం తయారుచేసిన పట్టు చీర 60 మీటర్ల పొడవు ఉంది. ఈ చీర బార్డర్లకు రామాయణ ఘట్టం మొత్తాన్ని చిత్రాలుగా నేశారు. వాటిని కంప్యూటర్‌లో రూపొందించుకుని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుచీర అంచులపై చూపించారు. 5 లక్షల రూపాయల విలువైన పట్టుచీరను పూర్తిగా నాణ్యమైన పట్టుతో తయారు చేసినట్లు వారు తెలిపారు. అయోధ్యకు పంపే ముందు ధర్మవరంలో ఈ చీరను, ప్రజల కోసం ప్రదర్శనగా ఉంచారు. అయోధ్యలో రామాలయం ప్రతిష్ట కార్యక్రమం పూర్తయ్యాక, చీరను తీసుకెళ్లడానికి నాగరాజు, నాగేంద్రనాథ్ కుటుంబసభ్యులు ప్రణాళిక చేశారు.
అయోధ్యలో టెంట్ సిటీ సిద్ధం - ప్రముఖుల కోసం స్పెషల్ కాటేజీలు - ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?