అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయులు సత్తా చాటారు. మిషిగన్ లెజిస్లేటివ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు.. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ తానేదార్ (65) డెమొక్రాట్ పార్టీ నుంచి 90 శాతానికిపైగా ఓట్లతో ఎన్నికయ్యారు. శ్రీనివాస్ తానేదార్ స్వస్థలం బెలగావిలోని మీరాపూర్. శ్రీనివాస్ తానేదార్ గెలుపుపై బెలగావీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ జీవిత విశేషాలు..
శ్రీనివాస్ పుట్టిపెరిగిందంత బెలగావీలోనే. గేయ రచయితగా, శాస్త్రవేత్తగా అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయన సుపరిచితులు. ఈయన విద్యాభ్యాసమంతా చింతామన్రావ్ ప్రభుత్వ పాఠశాలలో సాగింది.
1977లో బాంబే యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పీజీ పట్టాను పొందారు శ్రీనివాస్. ఆపై ఉన్నత చదువులకోసం 1979లో అమెరికాకు వెళ్లారు. 1982లో పాలిమర్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పట్టాను పొందారు. 1982-84 మధ్య యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో ప్రొఫెసర్‌గా పని చేశారు.
ఆటుపోట్లు..
శ్రీనివాస్ తానేదార్ 18 ఏళ్ల వయస్సులో బ్యాంకర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎంఎస్ఈ చేయాలని భావించారు. అయితే అందుకు కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది అంగీకరించలేదు. అయినప్పటికీ ఎంఎస్ఈ చేయాలనే పట్టుదలను మాత్రం వదలలేదు. ఆ ప్రయత్నంలో ఉద్యోగాన్ని కూడా కోల్పోయారాయన.