Sanjay Raut ED case: తన జీవితంలో ఎలాంటి తప్పుచేయలేదని.. అందుకే తనకు ఎలాంటి భయంలేదన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. 'ఒకవేళ ఈడీ విచారణకు పిలవడంలో రాజకీయమే ఉంటే ఆ సంగతి తర్వాత చూసుకుంటా. ప్రస్తుతం ఈడీను తటస్థ సంస్థగా భావించి విచారణకు హాజరవుతున్నాను' అని అన్నారు. శుక్రవారం ఈడీ విచారణకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్ భూకుంభకోణంలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఏప్రిల్‌లో ఈడీ జప్తు చేసింది. నగదు అక్రమ చలామణి వ్యవహారం కేసులో విచారణకు రావాలంటూ కొన్ని రోజుల క్రితమే ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విచారణ నిమిత్తం రౌత్ నేడు ఈడీ ఎదుట హాజరయ్యారు.
మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఐటీ నోటీసులు గురువారం రాత్రి వచ్చాయి. తనకు ఆదాయపు విభాగం నుంచి నోటీసులు వచ్చినట్లు శరద్ పవార్ గురువారం రాత్రి ట్విటర్‌లో వెల్లడించారు. ఆ నోటీసులను ప్రేమ లేఖగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
"నాకో ప్రేమ లేఖ అందింది. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం నుంచి ఈ ప్రేమ లేఖ వచ్చింది" అని పవార్ ట్వీట్ చేశారు. అయితే ఇందులో తాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటికి సంబంధించిన సమాచారమంతా తన వద్ద ఉందని తెలిపారు. ఈ నోటీసులకు సంబంధించిన ఇతర వివరాలేవీ పవార్ వెల్లడించలేదు. అయితే, ఈ నోటీసులపై ఎన్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 'మహారాష్ట్రలో ప్రభుత్వం మారగానే.. మా పార్టీ అధ్యక్షుడికి ఐటీ నోటీసులు వచ్చాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా దీని వెనుక ఇంకేమైనా ఉందా?' అని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపస్ అనుమానాలు వ్యక్తం చేశారు.
హవాలా కేసులో ఇద్దరు అరెస్టు..: హవాలా కేసులో మే 30న అరెస్ట్ అయిన దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యాపారవేత్తలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సత్యేందర్ జైన్‌తో సంబంధాలు ఉన్న వ్యాపారవేత్తలు వైభవ్ జైన్, అంకుశ్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
మనీలాండరింగ్ కేసులో మంత్రి సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత.. ఈడీ ఆయన కుటుంబసభ్యులతో పాటు సహచరుల ఇళ్లపై రెండు సార్లు సోదాలు నిర్వహించింది. అయితే సత్యేందర్ జైన్ నిజమైన దేశభక్తుడని, నిజాయితీ గల వ్యక్తి అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయనను తప్పుడు కేసులో ఇరికించారని, ఈడీ విచారణ తర్వాత బయటకు వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
ఇదీ చదవండి: 'పార్టీ ప్రతినిధి అయితే ఇష్టానుసారం మట్లాడుతారా?'.. నుపుర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
'ఇప్పుడు నాకు ఎవరూ అడ్డులేరు.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను'