కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్టు నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ అంత్యక్రియలను మధ్యప్రదేశ్‌లోని ఆయన స్వస్థలంలోని శనివారం నిర్వహించారు. గురువారం రాత్రి ఆయన కన్ను మూశారు. నర్మదాపురంలోని అంఖ్మవూ గ్రామంలో ఆయనకు చివరి సంస్కారాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మృతదేహం భోపాల్‌కు చేరుకోగా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ నివాళులు అర్పించారు. శరద్ యాదవ్ అంత్యక్రియలకు కాంగ్రెస్, భాజపా నేతలు పలువురు హాజరయ్యారు.
గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్.. గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సంతాపం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దిల్లీలోని శరద్ యాదవ్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. శరద్ యాదవ్ మృతి నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం శుక్రవారం సంతాప దినం పాటించింది. శరద్ యాదవ్‌కు భార్య ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
మధ్యప్రదేశ్, నర్మదాపురం (అప్పట్లో హోశంగాబాద్) జిల్లాలోని అంఖ్మవూ గ్రామంలో ఆయన 1947 జులై 1న జన్మించారు. 1971లో జబల్పుర్లో ఇంజినీరింగ్ చదువుతుండగా ఆయన దృష్టి రాజకీయాలవైపు మళ్లింది. దీంతో విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన ఆయన.. సోషలిస్టు నేత రాంమనోహర్ లోహియా ఆలోచనలకు ప్రభావితమయ్యారు. సోషలిస్టు ఉద్యమంలో పాల్గొని పలుమార్లు అరెస్టయ్యారు. జయప్రకాశ్ నారాయణ్ ప్రోత్సాహంతో జనతా పార్టీ తరఫున 1974లో జబల్పుర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఏడుసార్లు లోక్‌సభ ఎంపీగా, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు.
1999 నుంచి 2004 మధ్య వాజ్‌పేయూ ప్రభుత్వంలో శరద్ యాదవ్ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడయ్యారు. 2017లో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల.. ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు. 2018లో లోక్‌తాంత్రిక్ జనతాదళ్(ఎల్‌జేడీ) పార్టీ ఏర్పాటు చేశారు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఇది తొలి అడుగని శరద్ యాదవ్ అప్పట్లో పేర్కొన్నారు.