రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్(sharad pawar) పోటీ చేయనున్నారా? ఆయన ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడనున్నారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆయనతో భేటీ అయిన అనంతరం రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ప్రస్తుతం పవార్ ఒక్కరే కనిపిస్తున్నారు. అయితే దీనిపై ఎన్‌సీపీ వర్గాలు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భాజపా బలం అధికంగా ఉండడం వల్ల ఆ పార్టీ అభ్యర్థే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు పవార్ ఈ పదవికి పోటీ చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడే ఆయన ఈ పదవిని కోరుకుంటారా అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
ఇదీ చూడండి: పవార్- ఫడణవీస్ భేటీపై శివసేన కీలక వ్యాఖ్యలు