Jharkhand Road Accident Today : ఝార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మంగళవారం మధ్యాహ్నం.. బొలెరో, బుల్లెట్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో బొలెరో అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హజారీబాగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
Car Fell Into Well Jharkhand : హజారీబాగ్.. పద్మ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమి గ్రామ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బొలెరో, బైక్ పరస్పరం ఢీకొట్టడం వల్ల బొలెరో అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయినట్లు పేర్కొన్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నట్లు చెప్పారు. రెస్క్యూ టీమ్.. బావిలో దిగి మృతదేహాలను బయటకు తీసిందని చెప్పారు.
కారును ఢీకొట్టిన ఆటో.. ఆరుగురు మృతి..
Uttar Pradesh Road Accident News: మరోవైపు, వేగంగా వెళ్తున్న కారును ఆటో ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఉత్తర్ప్రదేశ్.. ఆగ్రాలోని ఖేరాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి 10.30 నిమిషాలకు జరిగిందీ ప్రమాదం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆగ్రా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని చెప్పారు. మృతులను జయప్రకాశ్, సుమిత్, బ్రజేష్ దేవి, బ్రజ్మోహన్ శర్మ, మనోజ్ శర్మ, ఆటో డ్రైవర్ భోలాగా గుర్తించారు. కారు డ్రైవర్ బంటీ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. అతడు మద్యం మత్తులో కారు నడిపి ఉంటాడని అనుమానిస్తున్నామని తెలిపారు. బంటీ.. ఇద్దరు స్నేహితులు పింకు, బనియాలను అరెస్టు చేసినట్లు తెలిపారు.