Manipur violence : మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిష్ణుపుర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హింసాకాండలో తండ్రి, కుమారుడు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్వాక్తా సమీపంలోని ఉఖా తంపక్ గ్రామంలోకి ఆయుధాలతో ప్రవేశించిన కొందరు దుండగులు.. నిద్రిస్తున్న ముగ్గురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి అనంతరం కత్తులతో వారిని నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన దుండగులను సమీప ప్రాంతంలో గుర్తించిన పోలీసులు, భద్రతా దళాలు.. వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించాయని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, దుండగులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించాయి.
"మృతులు ముగ్గురూ శుక్రవారం వరకు క్వాక్తా పునరావాస శిబిరంలో ఉండేవారు. ఆ రోజు సాయంత్రమే పరిస్థితి మెరుగుపడిందని తమ నివాసాలకు వెళ్లారు. అంతలోనే వారిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి హతమార్చారు. పోలీసులు, దుండగుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు సహా ఓ పోలీసు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ వైద్యం కోసం ఇంఫాల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించాం."
--పోలీసులు
Bishnupur Manipur Violence : మరోవైపు.. బిష్ణుపుర్ జిల్లాలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ ఇంఫాల్, తూర్పు ఇంఫాల్ జిల్లాల్లోనూ కర్ఫ్యూ విధించారు. ఇటీవలే పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో రెండు ఇళ్లకు గుర్తు తెలియని దుండగులు బుధవారం వేకువజామున నిప్పంటించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
Manipur Violence Why : గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్ హింసాత్మక పరిస్థితులో నెలకొన్నాయి. ఎస్టీ హోదా కోసం మెయిటీల డిమాండ్‌కు మణిపుర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఇది ఘర్షణలకు దారితీసింది. మణిపుర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే ఉన్నారు. మణిపుర్ వ్యాలీలోనూ వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు.