ఒడిశా బలాంగీర్‌కు చెందిన వెంకట్ రామన్ పట్నాయక్ అనే యువకుడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కోడింగ్‌లో అసామాన్య ప్రతిభ చూపిస్తున్నాడు. ఇటీవల ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్వహించిన మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్(ఎమ్‌టీఏ) పరీక్షలో నెగ్గి సీనియర్ ఇంజినీర్లకు సవాలు విసురుతున్నాడు. పట్టుమని పదేళ్లు కూడా లేని ఈ బుడతడు పెద్దయ్యాక ఖగోళశాస్త్రవేత్త అవుతానని అంటున్నాడు. 250కుపైగా మొబైల్ అప్లికేషన్లను రూపొందించి ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
'ఎమ్‌టీఏ' కొట్టి.. రికార్డు పట్టి..
మైక్రోసాఫ్ట్.. ఈ ఐటీ కంపెనీలో పని చేయడానికి ఆశపడని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉండరు. ఇందులో చేరడానికి ముఖ్యంగా ఉండాల్సిన సాఫ్ట్వేర్ కోడింగ్‌ను ఈ బుడుతడు కేవలం 5ఏళ్లకే ఒంటబట్టించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధించిన అతి చిన్న వయస్కుడు వెంకట్ రామనే కావడం విశేషం. ఈ చిన్నారి ప్రతిభతో ఎన్నో బహుళజాతి సంస్థలను ఒక్కసారి తనవైపుకు తిప్పుకున్నాడు.
"రామన్‌కు చిన్నప్పటి నుంచి కోడింగ్ అంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా కంప్యూటర్ ముందు కూర్చొని ప్రయత్నించేవాడు. ప్రస్తుతం 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ప్రవేశం ఉంది. ఆ జ్ఞానంతోనే మైక్రోసాఫ్ట్ అసోసియేట్ పరీక్షను పూర్తి చేయగలిగాడు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే గొప్ప శాస్త్రవేత్త అవ్వాలని కోరుకుంటున్నాం."
- తల్లిదండ్రులు
తల్లిదండ్రుల ప్రోత్సాహం..
అయిదేళ్ల వయసులోనే అల్గారిథం రాయడం ప్రారంభించిన ఈ చిన్నారి బుద్ధికుశలతను చూసిన తల్లిదండ్రులు అంతకు మించి ఏదైనా చేయాలనుకున్నారు. కర్ణాటక బెంగళూరులోని ఓ కోడింగ్ స్కూల్లో ప్రవేశం కోసం యాజమాన్యాన్ని సంప్రదించారు. పిల్లాడి వయసు దృష్ట్యా సిబ్బంది మొదటగా ఒప్పుకోలేదు. కానీ ప్రవేశ పరీక్షలో చిన్నారి చూపిన అసామాన్య ప్రతిభను చూసి ముక్కున వేలేసుకున్నారు.
250కి పైగా అప్లికేషన్లు..
ఒక్క మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించడం అనేది సాదాసీదా విషయం కాదు. అలాంటిది వెంకట్ రామన్ 250కు పైగా అప్లికేషన్లకు కోడింగ్ రాశాడు. దీంతో అతి చిన్న వయసులోనే ఈ మైలురాయి సాధించిన బుడతడుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. సీ, జావా, ఒరాకిల్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పట్టు సాధించి ప్రపంచ స్థాయి కంపెనీల దృష్టిని ఆకర్షించాడు.