కొవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. దిల్లీలో ఆయన మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 'పాఠశాల అంటే టీచర్, హెల్పర్, విద్యార్థులు ఉంటారు. అందరూ ఒకేచోట కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందువల్ల మనకు ఉత్తమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించినప్పుడో.. వైరస్ చాలావరకు తగ్గిపోయినప్పుడో మాత్రమే అలా చేయడం మంచిది. ఇదివరకు స్కూళ్లు తెరిచినప్పుడు వైరస్ విజృంభించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు వైరస్ తగ్గినట్టు కనిపించడానికి కారణం.. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, ప్రజలు క్రమశిక్షణతో ఉండటమే. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, పాఠశాలలు కూడా మొదలుపెడితే వైరస్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈమేరకు ఎప్పుడు స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉంటుంది. ఇందులో రెండు మూడు మంత్రిత్వశాఖలు భాగస్వాములవుతాయి. ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతతో ఈ నిర్ణయం తీసుకోవాలి' అన్నారు.
మూడో ఉద్ధృతికి అడ్డుకట్ట ఇలా..
ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తే మూడో ఉద్ధృతి (వేవ్) రావడానికి అవకాశం ఉండదని వీకే పాల్ పేర్కొన్నారు. 'కరోనా మూడో ఉద్ధృతిపై చర్చ జరగడం చాలా మంచిదే.. వైరస్ వ్యాప్తికి మనం ఎంత అవకాశం ఇస్తున్నామన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. గుంపులు గుంపులుగా తిరిగి.. సభలు, సమావేశాలు పెట్టుకున్నప్పుడు కరోనా విస్తరించే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా దేశాల్లో రెండో వేవ్ కూడా రాలేదు. అందువల్ల 'వేవ్'కు స్పష్టమైన 'రూల్' ఏమీ లేదు. ప్రభుత్వపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా నిర్లక్ష్యంగా లేకపోతే మూడో ఉద్ధృతి రాదు. వ్యక్తిగతంగా, వ్యవస్థాగతంగా క్రమశిక్షణ అనుసరిస్తే ఇబ్బంది ఉండదు' అని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పెరుగుతున్నకొద్దీ అత్యధిక మందికి రక్షణ లభిస్తుందని, అంతవరకూ అందరూ కట్టుదిట్టమైన నిబంధనలను పాటించాలన్నారు. మరో 5-6 నెలలు ఇంతే కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
3 రాష్ట్రాల్లో 'డెల్టా ప్లస్'
దేశంలో 3 రాష్ట్రాల్లో మొత్తం 22 కరోనా 'డెల్టా ప్లస్' రకం కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇందులో 16 కేసులు మహారాష్ట్రలో (రత్నగిరి, జల్‌గావ్‌లలో)ను.. మిగతావి మధ్యప్రదేశ్, కేరళలలో నమోదైనట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 10 దేశాల్లో (అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలండ్, నేపాల్, చైనా, రష్యా) డెల్టా ప్లస్ రకం కేసులు వెలుగు చూసినట్లు చెప్పారు. దీని నియంత్రణకు చర్యలు చేపట్టాలన్న విషయమై ఆయా రాష్ట్రాలకు అడ్వయిజరీలు జారీ చేసినట్లు చెప్పారు. కాగా ఇంతవరకు డెల్టా రకం 80 దేశాల్లో బయటపడినట్లు తెలిపారు.
డెల్టా ప్లస్ రకాన్ని..
'ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్షియం ఆన్ జీనోమిక్స్ (ఇన్సాకాగ్)' ప్రస్తుతం ఆందోళనకర రకం (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)గా పేర్కొన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనిలో సంక్రమణశక్తి పెరగడం, ఊపిరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టిగా బంధాన్ని ఏర్పరచడం, మోనాక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇన్సాకాగ్ పేర్కొంది.
ఇదీ చూడండి: 70 శాతం మందికి తొలి డోసు పూర్తి!