దేశం నలుమూలలా దాదాపు ఏడాదిపాటు మూతపడి ఉన్న పాఠశాలల్ని మొన్న ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో కొన్నిచోట్ల తెరిచినా- మలిదశ కరోనా విజృంభణ భయాందోళనల మధ్య మళ్ళీ తాళాలు బిగించాల్సి వచ్చింది. ఇప్పటికీ తరతమ భేదాలతో అదే అనిశ్చితి, ఉద్విగ్నత కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఇలా నెలల తరబడి ప్రత్యక్ష బోధనకు దూరంకావడం ఎన్నడూ కనీవినీ ఎరుగనిది. యూపీ, తెలంగాణ, బిహార్ వంటి రాష్ట్రాల్లో బడుల్ని త్వరగా పునరారంభించనున్నారన్న సమాచారం పెద్దయెత్తున కలకలం రేకెత్తిస్తోంది. విడతలవారీగా పాఠశాల తరగతుల్ని ప్రారంభించాలన్న విద్యాశాఖ యోచనను ఖండిస్తూ దాఖలైన అర్జీపై విచారణలో భాగంగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సూటిగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది! ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ మూలాన ఏ ఒక్కరు మరణించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మూన్నాళ్లక్రితం, నిన్నా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయం 'సుప్రీం' నిర్దేశ పర్యవసానమే. ఒక్కో పరీక్షా కేంద్రంలో 15-20 మందిని కూర్చోబెడతామనడాన్ని సర్వోన్నత న్యాయస్థానం గర్హించిన చందంగానే, ఇరుకిరుకు పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరమెలా పాటించగలరని తాజాగా తెలంగాణ హైకోర్టూ నిగ్గదీసింది.
క్షేత్రస్థాయి స్థితిగతుల్ని, భిన్నాంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయకుండా, మార్గదర్శకాలేవీ రూపొందించకుండానే తరగతుల నిర్వహణపై యోచనను బహిరంగపరచి తలంటించుకున్న విద్యాశాఖ- ఇప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతోనే పిల్లల్ని అనుమతిస్తామంటోంది. మూడోదశ ప్రకోపంపై కథనాలు, కొన్ని రాష్ట్రాల్లో 'డెల్టా ప్లస్' రకం కేసులు వెలుగు చూస్తున్న దశలో ఏ అమ్మానాన్నలైనా బిడ్డల్ని బడికి ఎలా పంపిస్తారు? ఎక్కువమందికి వ్యాక్సిన్ రక్షణ లభించిన తరవాతే పాఠశాలలు తెరిచే యోచన చేయాలంటున్న 'నీతి ఆయోగ్' సైతం, ప్రస్తుతం ప్రాణాల్ని పణంపెట్టే దుస్సాహసానికి తెగించరాదన్న వాదనలకే గట్టిగా ఓటేస్తోంది!
పెనుసంక్షోభంలోకి నెట్టడమే!
పూర్తిస్థాయి సన్నద్ధత, సమగ్ర విధివిధానాల క్రోడీకరణ కొరవడటాన్ని ఆక్షేపిస్తూ ఉన్నత న్యాయస్థానం ప్రస్తావించిన అంశాలు అత్యంత కీలకమైనవి. దేశంలో ఎన్నోచోట్ల లాక్‌డౌన్ ఉపసంహరణ, ఆంక్షల సడలింపు వేళ అసంఖ్యాక వయోజనులు యథేచ్ఛగా కనీస జాగ్రత్తల్నీ తుంగలో తొక్కి నియమోల్లంఘనలకు పాల్పడటాన్ని యావత్ జాతీ పరికించింది. అటువంటిదిప్పుడు చిన్నపిల్లలు పాఠశాలల్లో నియమబద్ధంగా తరగతులకు హాజరై వైరస్ పాలబడకుండా క్షేమంగా ఇంటిబాట పట్టగలరని ఆశించగలమా? దేశంలోని 15లక్షల పాఠశాలల్లో ఎన్ని తరగతి గదులు కొవిడ్ నిబంధనావళికి అనుగుణంగా ఉన్నాయి? లెక్కకు మిక్కిలి పాఠశాలల్లో చేతులు కడుక్కునేందుకు నీటికీ కరవేనని, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానమని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికాంశాలు, పార్లమెంటరీ సంఘాల అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నాయి. మౌలిక సదుపాయాలకు నిత్యక్షామం ఒక పార్శ్వమే. పాఠశాలల ప్రారంభానికి మునుపే కొవిడ్ నిబంధనావళికి సంబంధించి ఉపాధ్యాయులందరికీ విస్తృత అవగాహన కలిగించాలని కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలు చాటుతున్నాయి. అటువంటి శిక్షణ కార్యక్రమం ఊసెత్తకుండానే తరగతి గదుల్లో పాఠాలు మొదలుపెట్టేస్తే, అది బడి పిల్లల్ని చేజేతులా పెనుసంక్షోభంలోకి నెట్టుకుపోవడమే. వ్యాక్సినేషన్ ప్రక్రియను సంతృప్తికరంగా ముగించి, ఎక్కడా కొవిడ్ ప్రజ్వలనానికి అనుకూల వాతావరణం లేకుండా పరిశుభ్రతా ప్రమాణాలకు పెద్దపీట వేశాకనే, తరగతుల నిర్వహణకు సిద్ధపడటం ఉత్తమం. రేపటితరం భద్రత పట్ల తల్లిదండ్రులు, న్యాయస్థానాల సహేతుక స్పందనకు అనుగుణంగా- ప్రభుత్వ యంత్రాంగాల కార్యాచరణ పదును తేలాలి. ఆలోగా ఆన్‌లైన్ బోధనను సమధికంగా సజావుగా విద్యార్థులకు చేరువ చేసేలా అత్యవసర చర్యలు చురుకందుకోవాలి!
ఇదీ చూడండి: నేటి నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు, అధ్యాపకులు