మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కేంద్రం కొత్తగా పది శాతం రిజర్వేషన్లను.. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగానే ఇచ్చిందన్న సుప్రీం ధర్మాసనం 50 శాతం రిజర్వేషన్ పరిమితి నిర్ణయంపై పునఃపరిశీలన అవసరం లేదని తేల్చిచెప్పింది.
ఇందిరా సాహ్నీ కేసులో 50 శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు.. విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పింది. మరాఠా రిజర్వేషన్లను సమర్థిస్తూ, బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు కాగా.. వాటిపై అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. మరాఠా రిజర్వేషన్లు సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘించాయని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:'భారత్ చేసింది స్నేహపూర్వక సాయం'