వివాదాస్పదంగా మారిన కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు చట్టాలపై స్టే కొనసాగుతుందని తెలిపింది. కేంద్రం-రైతుల మధ్య సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే తెలిపారు. రైతుల సమస్యలపై కమిటీ దృష్టిసారిస్తుందని చెప్పారు. చట్టాన్ని షరతులతోనే సస్పెండ్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. నిరవధికంగా కాదని స్పష్టం చేశారు.
అభిప్రాయాలు చెప్పండి
సమస్య పరిష్కరించాలనుకుంటున్నట్లు చెప్పిన అత్యున్నత ధర్మాసనం.. నిరసన చేస్తున్న రైతులు ఇందుకు సహకరించాలని కోరింది. కమిటీ ఏర్పాటు చేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. సమస్య పరిష్కారం కావాలంటే రైతులు తమ అభిప్రాయాలను చెప్పాల్సిందే అని స్పష్టం చేసింది. దేశ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. రాజకీయానికి, న్యాయవ్యవస్థకు తేడా ఉందని పేర్కొంది.
"క్షేత్ర స్థాయిలో పరిస్థితి తెలుసుకునేందుకే కమిటీ వేయాలని అనుకుంటున్నాం. సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి ఉన్న వారందరూ.. కమిటీ ముందుకు వెళ్లాలి. రైతులు కమిటీ ముందుకు వెళ్లరు అనే మాటలు వినడానికి సిద్ధంగా లేము. రైతులు ప్రభుత్వం ముందుకు వెళ్లగలిగినప్పుడు.. కమిటీ వద్దకు ఎందుకు వెళ్లరు? పరిష్కారం లేకుండా నిరసన ప్రదర్శన చేయాల్సి వస్తే.. అది నిరవధికంగా జరుగుతూనే ఉంటుంది. 400 వరకు రైతు సంఘాలు ఉన్నాయని మాకు సమాచారం ఉంది. రైతులు తమ న్యాయవాది ద్వారా అయినా అభిప్రాయం చెప్పాలి."
-సుప్రీంకోర్టు
వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని ఒక్క మాట కూడా రైతులతో మాట్లాడటం లేదన్న న్యాయవాది శర్మ వాదించగా.. ఆ విషయంలో తాము ఏమీ చెప్పలేమని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.
మరోవైపు, దక్షిణ భారతంలో రైతులు వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ఉన్నారని సొలిసిటర్ జనరల్ సోమవారం చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ఎంపీ తిరుచ్చి శివ తరపు న్యాయవాది ఖండించారు.
'నిషేధిత సాయం'పై ప్రమాణపత్రం!
ఆందోళనకు నిషేధిత సంస్థ సాయం చేస్తోందని తమకు పిటిషన్ వచ్చిందని సుప్రీం పేర్కొంది. నిషేధిత సంస్థ నుంచి సాయం అందిన ఆరోపణలను ఒప్పుకుంటారా? ఖండిస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆందోళనల్లో ఖలీస్థానీలు చొరబడ్డారని ఇప్పటికే చెప్పామని సొలిసిటర్ జనరల్ సమధానమిచ్చారు. అయితే పూర్తి వివరాలతో బుధవారంలోగా ప్రమాణపత్రం దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీపై దాఖలైన పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం.. దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో సభ్యులు(ఇప్పటివరకు వచ్చిన పేర్లు)
- హర్సిమ్రత్ మాన్
- ప్రమోద్ జోషి
- అశోక్ గులాటి
- భూపేంద్ర సింగ్ మాన్
- అనిల్ ధన్వంత్