దేశంలో నిషేధిత బాణసంచా విక్రయంపై (Supreme Court on Crackers) సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిషేధిత టపాసులను రాష్ట్రాల్లో బహిరంగంగానే విక్రయిస్తున్నారని పేర్కొంది. వీటిపై నిషేధం అమలులో ఉంటే అసలు అవి మార్కెట్లో అందుబాటులోకి ఎలా వచ్చేవని ప్రశ్నించింది. ఈ టపాసులపై ఇదివరకు విధించిన నిషేధాన్ని అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాల్సిందే అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
'వాటిని అలా అమ్మేస్తున్నారు'
నిషేధిత పదార్థాలను బాణసంచా తయారీలో వినియోగించి పర్యావరణహిత టపాసులుగా విక్రయిస్తున్నారని (Supreme Court on Crackers) ధర్మాసనం పేర్కొంది. టపాసులతో వేడుకలను జరుపుకోవడంపై తమకు అభ్యంతరం లేదని, కానీ అవి ఇతరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా ఉండాలని స్పష్టం చేసింది. బాణసంచా విక్రయంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
సీబీఐ నివేదిక ఆధారంగా పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
'ఆశ్చర్యంగా ఉంది'
బాణసంచా నిషేధం అమలు ప్రధాన సమస్యగా మారిందని ధర్మాసనం పేర్కొంది.
"తయారీదారులు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారీ మొత్తంలో బాణసంచా తయారీకి ఉపయోగించే బేరియం సాల్ట్‌ను కొనుగోలు చేసి గోదాముల్లో భద్రపరిచారు. దీని గురించి ప్రశ్నిస్తే అది టపాసుల తయారీకి వినియోగించట్లేదని చెప్తున్నారు. ఆ గోదాముల్లో ఆ రసాయనాన్ని భద్రపరిచింది ప్రదర్శనకు కాదు."
-సుప్రీంకోర్టు
ధర్మాసనం వ్యాఖ్యలపై బాణసంచా ఉత్పత్తిదారుల సమాఖ్య తరపు న్యాయవాది స్పందిస్తూ.. ఒకటి లేదా రెండు సంస్థలు నిబంధనలను ఉల్లఘించినందుకు మొత్తం పరిశ్రమ ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
ఇదీ చూడండి : 'ఓవైపు 75ఏళ్ల వేడుకలు.. మరోవైపు అడ్డగింతలా?'