కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందించడంపై దాఖలైన కేసులపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. కొవిడ్ మృతులకు ఇచ్చే డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాలను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది.
ఈ అంశానికి సంబంధించి దాఖలైన రెండు వేరు వేరు పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం. ఒకటి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించడంపై కాగా, మరోటి మృతుల డెత్ సర్టిఫికెట్ల జారీపై పిటిషన్లు దాఖలయ్యాయి.
కొవిడ్ బాధితులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు ఎలాంటి అధికారిక పత్రం ఇవ్వనిదే.. బాధితులకు పరిహారం పొందే అవకాశం ఉండదని ధర్మాసనం పేర్కొంది. కరోనాతో ఎవరైనా చనిపోతే వారి మరణ ధ్రువీకరణ పత్రంలో వైరస్ కారణంగా మృతిచెందినట్లు పేర్కొనాలని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 12(3)కి సంబంధించి అమలులో ఉన్న అన్ని పథకాల వివరాలు తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయలని పేర్కొంది.
తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి : వలస కూలీల రిజిస్ట్రేషన్‌పై సుప్రీం అసంతృప్తి