NEET-PG Exam: నీట్ పీజీ- 2022 పరీక్షను వాయిదా వేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరీక్ష ఆలస్యమైతే డాక్టర్ల కొరత ఏర్పడుతుందని, తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్ సభ్యులుగా గల ధర్మాసనం పేర్కొంది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల విద్యార్థుల జీవితాలను అయోమయంలోకి నెడుతుందని, గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది.
''విద్యార్థుల్లో రెండు కేటగిరీల వారు ఉన్నారు. ఓ వర్గం వాయిదా వేయాలని కోరుతోంది. పరీక్ష కోసం సన్నద్ధమైన 2 లక్షల 6 వేల మంది విద్యార్థులున్న మరో పెద్ద వర్గానికి నష్టం జరుగుతుంది. కరోనా కారణంగా పరీక్షల షెడ్యూల్ ప్రభావితమైంది. దానిని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.''
- సుప్రీం కోర్టు ధర్మాసనం
నీట్ పీజీ పరీక్ష ఈ నెల 21న జరగాల్సి ఉంది. అయితే.. నీట్ పీజీ- 2021 కౌన్సెలింగ్ ఇంకా జరుగుతుందని, అందులో సీటు దక్కని విద్యార్థులు నీట్-పీజీ 2022కు సన్నద్ధమయ్యేందుకు వీలు కల్పించాలని కోరుతున్నారు. అందుకు అనుగుణంగా పరీక్ష వాయిదా వేయాలని కొందరు వైద్యుల బృందం ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు మే 10న అంగీకరించింది అత్యున్నత న్యాయస్థానం. తాజాగా.. వారి అభ్యర్థనను తిరస్కరించింది. పరీక్ష వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయను కూడా విజ్ఞప్తి చేసింది భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ).
ఇవీ చూడండి: జేఈఈ పరీక్ష వాయిదా.. నీట్ తేదీ ఖరారు