ఎన్నికల కమిషనర్ల నియామకంలో పాటిస్తున్న మార్గదర్శకాలు చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. నవంబర్ 19న కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గురువారం కోర్టు ముందు ఉంచాలని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషనర్ల నియామకంపై విచారణ ప్రారంభమైన మూడు రోజుల్లోనే నియామకం జరిగిందన్న ధర్మాసనం అలా జరగకుండా ఉంటే మరింత సముచితంగా ఉండేదని వ్యాఖ్యానించింది. అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను గురువారం తీసుకురావాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది.
ఈ కేసును విచారించడం మొదలు పెట్టిన తర్వాత నియామకం జరిగినందున ఆ దస్త్రాలను చూడలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. నియామకం కోసం అనుసరించిన ప్రక్రియ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నియామకం చట్టబద్ధమైనదైతే భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీబీఐ డైెరెక్టర్ తరహాలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటి ద్వారా ఎంపిక జరపాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రస్తుత వ్యవస్థలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. తమకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తినే సీఈసీగా నియమిస్తోందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి.. 1991 చట్టం ప్రకారం జీతాలు, పదవీకాలాల విషయంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగానే ఉందని తెలిపారు. సీఈసీ నియామక ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థ సరిగ్గానే ఉందని, ఇందులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీనియర్ అధికారుల జాబితాను ఎంపిక చేసి.. దాన్ని న్యాయశాఖకు.. ఆ తర్వాత ప్రధానికి పంపుతామని తెలిపారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ వ్యవస్థ సరిగా లేదని తాము చెప్పడం లేదని పేర్కొంది. అయితే ఓ పారదర్శక ప్రక్రియ అవసరమని అభిప్రాయపడింది. ఎప్పుడూ సివిల్ సర్వెంట్లనే ఎన్నికల కమిషనర్లుగా ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలంటే.. కింది స్థాయి నుంచే పారదర్శక నియామక ప్రక్రియ ఉండాలని సూచించింది. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఏమైనా ఆరోపణలు వస్తే అప్పుడు ప్రభుత్వం నియమించిన సీఈసీ.. ప్రధానిపై చర్యలు తీసుకోలేరని, అది వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లేనని అభిప్రాయపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమైతే ప్రధానిపై చర్యలు తీసుకునే సీఈసీ కావాలని అందుకే.. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకం కోసం సమ్మిళిత ప్రక్రియ అవసరమని తెలిపింది. ఈ నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సభ్యుడిగా చేర్చాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
1985 పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ పలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో కార్యదర్శిగా పనిచేశారు. నవంబర్ 18న ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయగా 19న ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ 2025 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనుండగా అనంతరం అరుణ్ గోయల్ సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.