ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆరు డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను రాసింది(samyukt kisan morcha writes letter to modi). రైతులతో చర్చలను వెంటనే పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. అప్పటివరకు ఉద్యమం కొనసాగుతుందని తేల్చిచెప్పింది.
వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనలో.. తమ డిమాండ్ల పరిష్కారంపై సరైన వివరాలు లేవని, అందువల్ల తాము అసంతృప్తితో ఉన్నట్టు లేఖలో పేర్కొంది ఎస్కేఎం. నల్ల చట్టాలపై పోరులో భాగంగా రైతులపై వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు మద్దతుగా నిలిచి, పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.
ఉద్యమంలో సుమారు 700 మంది రైతులు చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని రైతు సంఘాల నేతలు మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరణించిన రైతులకు స్మారక చిహ్నం నిర్మించేందుకు సింఘూ సరిహద్దులో భూమి కేటాయించాలని కోరారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించటం వంటివి చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు రైతు నేతలు. లేఖలో పేర్కొన్న ఆరు అంశాలపై ప్రభుత్వం తమతో మళ్లీ చర్చలు జరిపే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఎస్కేఎం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'యథావిధిగా రైతు నిరసనలు- కొత్త డిమాండ్లతో మోదీకి లేఖ'