రాజస్థాన్ శాసనసభ ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. అధిష్ఠానం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సచిన్ పైలెట్ ఆందోళన బాట పట్టారు. వసుంధర రాజెే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జైపుర్లోని షహీన్ స్మారక్ వద్ద సచిన్ పైలట్ ఆందోళన ప్రారంభించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నిరాహార దీక్ష.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. అంతకుముందు సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే జయంతిని పురస్కరించుకొని జైపుర్లోని గోడౌన్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు పైలట్.
కాంగ్రెస్ పార్టీ స్పందన..
రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ సోమవారం స్పందించింది. పైలట్ దీక్ష పార్టీ వ్యతిరేక చర్య కిందకే వస్తుందని పేర్కొంది. బహిరంగంగా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా పార్టీలో చర్చిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసే బదులుగా.. పార్టీ వేదికలపై సమస్యలను లేవనెత్తాలని ఏఐసీసీ రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రణ్‌ధావా స్పష్టం చేశారు.
అంతకుముందు.. ఏప్రిల్ 9న (ఆదివారం) వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో సీఎం గహ్లోత్ సర్కారు విఫలమైందని సచిన్ పైలట్ ఆరోపించారు. ఈ క్రమంలోనే అవినీతిని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 11న (మంగళవారం) ఒక రోజు నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందనే భరోసా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో రాజే హయాంలోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని పైలట్ డిమాండ్ చేశారు.
ఎక్సైజ్ మాఫియా, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు, లలిత్ మోదీ కేసులపై చర్యలు తీసుకోవడంలో గహ్లోత్ సర్కారు విఫలమైందని పైలట్ ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో విచారణను ఎందుకు ప్రారంభించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ పాలనలోని అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని, అయినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ హామీలను నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్లలేమని పైలట్ అభిప్రాయపడ్డారు.
కాగా.. మరికొద్ది నెలల్లో రాజస్థాన్లో స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ సొంత పార్టీలోనే మరోసారి ధిక్కార స్వరం వినిపించడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. గహ్లోత్, పైలట్ వర్గాల్లో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతుండగా.. అధిష్ఠానం వారికి సర్దిచెబుతూ వస్తోంది. తాజాగా గహ్లోత్ సర్కారుపై పైలట్ దీక్షకు దిగడం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.