Sabarimala online donation : ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప భక్తులకు శుభవార్త తెలిపింది. ఇకపై శబరిగిరీశునికి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా భక్తులు కానుకలు పంపేలా ఈ-కానిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ బోర్డు అధ్యక్షుడు అనంత గోపాలన్ తదితరులు పాల్గొన్నారు. దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. మొదటి కానుకను ఆ సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ సమర్పించారు. ఈ-కానిక ద్వారా అయ్యప్పస్వామి గుడికి వచ్చే ఆదాయం పెరుగుతుందని ఆలయ బోర్డు భావిస్తోంది.
మరోవైపు.. శబరిమల క్షేత్రాన్ని జూన్ 15న తెరవనుండగా ఆ తర్వాత రోజు నుంచి నాలుగు రోజులు స్వామి సన్నిదానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Sabarimala virtual q : గతంలో భక్తుల కోసం శబరిమల ఆలయ బోర్డు వర్చువల్ క్యూ విధానాన్ని ప్రవేశపెట్టి బుకింగ్‌ను కేరళ పోలీసులకు అప్పగించింది. ఆనంతరం హైకోర్టు ఈ సేవలు దేవస్థానమే నిర్వహించాలని ఆదేశించింది. ఆలయబోర్డు ఈ వర్చువల్ క్యూ బుకింగ్ సంబంధించిన వెబ్సైట్ పనులను కూడా టీసీఎస్‌కు అప్పగించింది. వచ్చే నెలలోగా కూడా ఈ సేవలను ప్రారంభించనున్నారు.
Sabarimala temple collection : శబరిమల క్షేత్రానికి 2022లో భారీగా ఆదాయం సమకూరింది. అయ్యప్ప సీజన్లో రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం అయ్యప్ప స్వామి ఆదాయం ఆలయ చరిత్రలోనే అత్యధికమని వారు చెప్పారు. 2018 సీజన్లో అత్యధికంగా రూ.260 కోట్లు రాగా.. 2022లో ఆదాయం భారీగా పెరిగిందని పేర్కొన్నారు.
కరోనా తర్వాత ఈ సీజన్లోనే భక్తులను పూర్తి స్థాయిలో ఆలయానికి అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. చిన్నారులు కూడా స్వామి దర్శించుకునేందుకు పోటెత్తారు. మొక్కులు, కానుకలను శబరిగిరీశునికి సమర్పించారు. ఒక్క కాయిన్లను రూపంలోనే స్వామి ఆదాయం రూ.ఏడు కోట్ల వరకు వచ్చిందని అధికారులు తెలిపారు. మిగతా కానుకలను కలుపుకుని మొత్తం ఆదాయం రూ.330 కోట్లని పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా పూజలు
శబరిమలలో పవిత్రమైన మకరజ్యోతి వెలిగే కొండపై కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా పూజలు చేయడం ఆ మధ్య వివాదానికి దారితీసింది. పొన్నాంబలమేడు కొండపై తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పూజలు నిర్వహిస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఆ వ్యక్తి మంత్రాలు చదువుతూ, పూలు, ఆకులు చల్లుతూ పూజలు చేశాడు. వ్యక్తితో పాటు మరో నలుగురు అక్కడ ఉన్నట్లు వీడియోలో తెలుస్తోంది. కొండపై పూజలు నిర్వహిస్తున్నామని ఓ వ్యక్తి తమిళంలో మాట్లాడటం వీడియోలో వినిపిస్తోంది.
పూజ నిర్వహించిన అతని నారాయణ స్వామి అనే వ్యక్తి గుర్తించారు. గతంలో అతడు అయ్యప్ప ఆలయ పూజారి వద్ద సహాయకుడిగా పనిచేశాడు. అతడి వచ్చిన ఓ వ్యక్తి.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విషయం బయటకు వచ్చింది. వారు పొన్నాంబలమేడు కొండపై నుంచి శబరిమల ఆలయాన్ని కూడా వీడియో తీశారు. పటిష్ఠ భద్రత ఉండే ఆ చోట వారు పూజలు నిర్వహించటంపై దేవస్థానం బోర్డు అధికారులు సీరియస్ అయ్యారు.