శబరిమల యాత్రికుల బస్సు లోయలో పడి 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లా నిలక్కల్ సమీపంలోని ఇలావుంకల్ వద్ద జరిగిందీ ప్రమాదం. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సహాయంతో బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి దగ్గర్లోని కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రితో పాటు జిల్లా తాలూకా ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వీరందరూ చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు కూడా గాయపడినట్లు సమాచారం.
వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నామని.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో 9 మంది పిల్లలు సహా మొత్తం 64 మంది ఉన్నారు. యాత్రికులందరూ తమిళనాడులోని మయిలాదుతురయ్ జిల్లా వాసులని అధికారులు గుర్తించారు. వీరంతా శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సోమవారం పైంకుని పండుగను పురస్కరించుకుని శబరిమల ఆలయాన్ని తెరిచింది దేవస్థానం బోర్డు.
బైకులు- ట్రక్కు ఢీ.. నలుగురు దుర్మరణం..
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఓ ట్రక్కు, రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న
గరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న జున్నార్ తాలూకా అలెగావ్ గ్రామ సమీపంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. అలెగావ్ గ్రామ సమీపంలో అహ్మద్‌నగర్ వైపు వెళ్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టాయి. ఈ ఘటనలో బైక్‌లపై వెళ్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఓ మహిళ, పురుషుడితో పాటు ఆరు, రెండేళ్ల వయసున్న చిన్నారులు ఉన్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఐదుగురు ప్రాణాలు తీసిన అతి వేగం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖ్‌నవూ-హర్దోయ్ హైవేపై వేగంగా వస్తున్న ఓ ఆటో-కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చందారు. మరో నలుగురు గాయాపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని వారి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని అన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పంపించామని.. బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ రాజేశ్ ద్వివేది తెలిపారు.