రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటిస్తారని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సంవత్సరం చివరనే పుతిన్ భారత్ పర్యటన ఖరారవ్వగా.. కరోనా కారణంగా వాయిదా పడినట్టు పేర్కొంది. 'కరోనా మహమ్మారి నేపథ్యంలో నేరుగా కలవడం ఇబ్బందిగా మారింది. అందువల్లే ముఖాముఖీగా కలువలేకపోతున్నారు. భారత్-రష్యా మధ్య రాజకీయ, ఆర్థికపరమైన సంప్రదింపుల్లో ఎటువంటి లోటు లేదు. ఈ అక్టోబర్‌లోనే ఇరుదేశాల మధ్య సదస్సు జరగాల్సి ఉండేది. కానీ.. కొవిడ్ తీవ్రత దృష్ట్యా సదస్సును వాయిదా వేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అయితే.. వచ్చే ఏడాది తొలి ఆరునెలల్లోనే అధ్యక్షుడి పుతిన్ భారత్‌లో పర్యటిస్తారని ఆశిస్తున్నాం.' అని రష్యా రాయబారి నికోలయ్ కుదాషెవ్ వెల్లడించారు.
సైనిక సహకారం కోసం ద్వైపాక్షిక కమిషన్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఏర్పాటయ్యే అవకాశముందని చెప్పారు నికోలయ్ కుదాషెవ్. వీటితో పాటు ఆర్మేనియా, బెలారస్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, రష్యా దేశాలు భాగస్వామ్యం కలిగిన యురేషియా ఎకనామిక్ యూనియన్(యూఏఈయూ), భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కూడా జరిగే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.
భారత్‌లో స్పుత్నిక్-వీ ఉత్పత్తి..
స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ను భారత్, రష్యాలు సంయుక్తంగా ఉత్పత్తి చేస్తాయని నికోలయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రముఖ భారత ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఈ వ్యాక్సిన్ను తయారు చేయనున్నట్టు విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 11న కొవిడ్-19 వ్యాక్సిన్ను నమోదు చేసిన రష్యా.. ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచింది.
ఇదీ చదవండి: 'స్పుత్నిక్-వీతో కొత్తరకం కరోనానూ అరికట్టవచ్చు'