Russia Germany Died: బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని జమాదర్ తోలా గ్రామానికి వెళితే మీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు. ఆ గ్రామంలో రష్యా, జర్మనీ చనిపోయారు. మిగిలిన అమెరికా, ఆఫ్రికా, జపాన్‌లు వారి సోదరుల జ్ఞాపకాలతో జీవిస్తున్నారు. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశాలు కూడా తమ అన్నదమ్ములలాగే.. సోదరభావం విడనాడవద్దని చెబుతున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జమాదర్ తోలా గ్రామానికి చెందిన అకుల్ శర్మ భారత సైన్యంలో చేరారు. ఆ క్రమంలో యుద్ధంలో గాయపడ్డారు. శత్రువుల తూటాలు ఆయన భుజంలోకి దిగాయి. ఇంటికి వచ్చి చికిత్స చేయించుకుంటున్న సమయంలోనే ఆయన సోదరునికి కుమారుడు పుట్టాడు. అయితే.. పుట్టిన కుమారునికి అమెరికా పేరు పట్టాల్సిందిగా అకుల్ కోరారు. ఆయన కోరిక మేరకు పుట్టిన కుమారునికి అమెరికా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టిన వారికి కూడా అదే క్రమంలోనే ఆఫ్రికా, జర్మనీ, రష్యా, జపాన్లుగా నామకరణం చేశారు. ఆ సమయంలోనే వారి పేర్లు చర్చనీయాంశాలయ్యాయి.
విడనాడని సోదరభావం: తమ కుటుంబంలో అందరం కమ్మరి వృత్తి చేసేవారమని జపాన్ శర్మ తెలిపారు. ఐదుగురం అన్నదమ్ములం ఎంతో ప్రేమగా బతికేవారమని చెప్పారు. ఎప్పుడైనా చిన్న గొడవలు వచ్చినప్పటికీ చర్చలతో పరిష్కరించుకునేవారమని వెల్లడించారు. అయితే.. 2017లో జర్మనీ శర్మ మరణించారు. అంతకుముందు 2012లో రష్యా శర్మ మృతి చెందారు. వారి మరణం తర్వాత మిగిలిన ముగ్గురం ఎంతో ప్రేమగా బతుకుతున్నామని జపాన్ శర్మ పేర్కొన్నారు. అయితే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమలాగే సోదరభావంతో ఈ దేశాలు మెలగాలని కోరుకుంటున్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు: ఒకనొకసారి తమ మామయ్య ఇంటి దగ్గర పొరుగువారితో గొడవపడినప్పుడు తమ సోదరులు అండగా నిలిచారని జపాన్ శర్మ తెలిపారు. ఆ క్రమంలో ప్రత్యర్థులు తమపై కేసు పెట్టాలని పోలీస్‌స్టేషన్‌కు వెళితే వారికి ఊహించని అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చారు. శక్తివంతమైన దేశాలపేర్లు పెట్టుకున్న తమపై కేసు పెట్టలేనని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: శాంతి చర్చలు అంటూనే.. ఫిరంగుల మోత!