Robbery In Punjab : పంజాబ్‌లో మోగాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆభరణాలు కొనడానికి వచ్చినవారిలా నగల షోరూమ్‌లోకి ప్రవేశించిన దొంగలు.. అదును చూసుకుని గన్‌తో షాపు యజమానిని కాల్చి నగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోగా సిటీలో ఆసియా జ్యువెల్లరీ అనే నగల షోరూమ్ ఉంది. నగలు కొట్టేయాలనుకున్న ఐదుగురు దొంగలు ప్లాన్ చేశారు. పథకం ప్రకారం ముగ్గురు వ్యక్తులు షోరూమ్‌లోకి వెళ్లారు. కొంతసేపు అభరణాలు కొనుగోలు చేస్తున్నట్టు నటించారు. ఆ తర్వాత సమయం చూసుకుని యజమానిపై కాల్పులకు తెగబడ్డారు. అనంతరం దొరికినకాడికి నగలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో షోరూమ్ యజమాని తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని దయానంద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని.. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అయితే, ఈ ఘటనలో చోరీకి గురైన ఆభరణాలు విలువ ఎంత ఉంటుందనేది తెలియలేదు.
కళ్లలో కారం చల్లి.. పట్టపగలే చోరీ!
పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కళ్లలో కారం చల్లి దాదాపు రూ. 10.5 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది.
ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే వ్యక్తి బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి బయలుదేరాడు. ఇది గమనించిన నలుగురు దొంగలు.. రెండు బైక్‌లపై అతడిని వెంబడించారు. గురునానక్ దేవ్లో యూనివర్సిటీ సమీంలోకి రాగానే బాధితుడి కళ్లలో కారం చల్లి.. పదునైన ఆయుధాలతో దాడిచేశారు. అనంతరం అతడి దగ్గరున్న రూ. 10.5 లక్షల దోచుకుని పారిపోయారు. బాధితుడు తేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
ఇలా.. కళ్లలో కారం కొట్టిన దొంగతనం చేసిన ఘటన ఇంతకుముందు మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ ప్రాంతంలో జరిగింది. లవీన్ సోనీ అనే వ్యక్తి సరాఫా ప్రాంతంలో నగల దుకాణం నడిపాడు. సాధారణ వినియోగదారునిలాగే షాపులోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. షాపు యజమానిని మాటల్లో పెట్టి అతడి కళ్లలో కారం చల్లాడు. అనంతరం అక్కడ ఉన్న బంగారంతో పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమై జైళ్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.