జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. పూంఛ్ జిల్లాలోని సాజియాన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మండీలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న సైన్యం.. వెంటనే సహాయచర్యలు చేపట్టింది. బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. పూంఛ్ నుంచి గాలి మైదాన్‌కు బస్సు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతమైన సాజియాన్లోని బ్రారీ నాలాకు రాగానే బస్సు ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. పోలీసులు, ఆర్మీ, గ్రామస్థులతో కూడిన బృందం సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు.
రాష్ట్రపతి విచారం..
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ప్రాణనష్టం జరగడం బాధాకరమని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రూ.5 లక్షల పరిహారం..
మరోవైపు, ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
యూపీలో ఆరుగురు మృతి
మరోవైపు యూపీలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. సుల్తాన్‌పుర్‌లో ట్రక్కు బోల్తా కొట్టి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఉన్నావ్‌లో కారు- ట్రక్కు ఢీకొట్టుకోవడం వల్ల ముగ్గురు మరణించారు.
బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు సుల్తాన్‌పుర్‌లో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయోధ్య నుంచి వస్తున్న ట్రక్కు టైరు పేలిపోయిందని, ఈ క్రమంలోనే వాహనం బోల్తా కొట్టి టీస్టాల్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో స్టాల్లో ఉన్న రాజేశ్ అగ్రహారి(38), రాజన్ తివారి(55), రాకేశ్ కసోదాన్(45) అనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మరోవైపు, ఉన్నావ్‌లో ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు- కారు ఢీకొన్నాయి. ముగ్గురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గంగాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
కెనాల్లో ఆటో బోల్తా..
మరోవైపు, కర్ణాటకలోని తుంగభద్ర హైలెవెల్ కెనాల్లో ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సురక్షితంగా బయపడగా.. ముగ్గురు ప్రయాణికులు గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. బాధితులంతా బళ్లారి తాలుకా కొలగల్లు గ్రామానికి చెందినవారని సమాచారం.