అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు తప్పనిసరి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత శతాబ్దానికి చెందిన కొన్ని చట్టాలు.. నేటి తరానికి భారంగా మారాయని, అందుకే ఈ మార్పులు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
"అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు తప్పనిసరి. గత శతాబ్దానికి ఉపయోగకరమైన కొన్ని చట్టాలు ప్రస్తుత కాలానికి అనుకూలంగా లేవు. పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించడం అసాధ్యం. అందువల్లే మా ప్రభుత్వం సమగ్ర సంస్కరణల దిశగా అడుగులేస్తోంది. సంస్కరణలు అనేవి నిరంతరం మార్పు చెందే ప్రక్రియ."
- నరేంద్ర మోదీ, ప్రధాని
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్న తరుణంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే.. కొత్త చట్టాలు, రైతుల ఆందోళనల గురించి ఆయన ప్రస్తావించలేదు.
ప్రజా జీవితం సులభతరం చేసేందుకే..
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం సహా.. వారి జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు మోదీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించడం, విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు స్పష్టం చేశారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా.. నేషనల్ ఇన్ప్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద రూ. 100 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం మాస్టర్ ప్లాన్‌పై పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 27 నగరాల్లో సుమారు వెయ్యి కిలోమీటర్ల కొత్త మోట్రో రైలు మార్గాలకు నిర్మాణ పనులు జరుగుతున్నట్టు వివరించారు ప్రధాని. 2014లో తమ భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రంగంలో ఇది అతిపెద్ద పురోగతి అని ఆయన కొనియాడారు.
ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్
యూపీలో రూ.8,380 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఆగ్రా మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. 2 కారిడార్లు సహా.. 29.4 కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. యూపీలో ప్రధాన పర్యటక కేంద్రాలైన తాజ్‌మహల్, ఆగ్రా కోట, సికంద్రాలను.. రైల్వే, బస్ స్టేషన్లకు అనుసంధానించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఫలితంగా ఆగ్రాలోని 26 లక్షల మందికి ప్రయోజనం చేకూరడం సహా.. నగరానికి ఏటా వచ్చే 60లక్షల మంది పర్యటకులకు మెట్రో సేవలు అందనున్నాయి.
ఇదీ చదవండి: స్వామీ.. కొవిడ్ పరీక్ష తప్పదు సుమీ