ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో తల్లీకొడుకుల బంధానికి మచ్చతెచ్చే ఘటన వెలుగు చూసింది. మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ యువకుడు.. కన్నతల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పంకజ్ అనే యువకుడు గతకొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డిసెంబరు 25 సాయంత్రం కుమారుడికి ఆహారం పెట్టేందుకు తల్లి వెళ్లింది. ఆ సమయంలో తల్లిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రంగా దాడి చేసి చంపేస్తానని కూడా బెదిరించాడు. అడ్డు వచ్చిన తండ్రిని కూడా కొట్టాడు. ఈ మొత్తం విషయాన్ని బాధితురాలు.. తన కుమార్తెకు చెప్పింది. వెంటనే తల్లీకూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పౌరీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని ఖండూసైన్ జిల్లా జైలుకు తరలించారు.
మాజీ భార్య హత్యకు ప్లాన్.. పాయిజన్ ఇంజెక్షన్‌తో పొడిచి..
గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తన మాజీ భార్యను విషపూరితమైన సిరంజితో పొడిచి హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దిక్కుతోచని స్థితిలో స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలితో నిందితుడికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. కానీ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రెండు నెలల క్రితమే ఆమెకు విడాకుల ఇచ్చాడు. దీంతో బాధితురాలు వేరేగా ఉంటోంది.
క్రిస్మస్ రోజు విహారయాత్రకు వెళ్దామని బాధితురాలి కుమారులు ప్లాన్ చేశారు. అందరూ కలిసి షాపింగ్ వెళ్లారు. ఆ సమయంలో ఆమె వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఇదే ఆసరాగా తీసుకున్న నిందితుడు.. విషపూరితమైన సిరంజితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే ఆమె స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు నేరం ఒప్పుకున్నాడు.
కుమార్తె వీడియో వైరల్.. బీఎస్‌ఎఫ్ జవాన్ బలి!
గుజరాత్లో మరో విషాద ఘటన జరిగింది. ఓ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు.. కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. బాధితుడిని మెలాజీ వాఘేలా(45)గా పోలీసులు గుర్తించారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బీఎస్‌ఎఫ్ 56 బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నమెలాజీ వాఘోలా కుమార్తె వీడియోను శైలేష్ అనే యువకుడు ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. దీంతో మెలాజీ.. ఈ విషయంపై నిలదీయడానికి తన కుటుంబ సభ్యులతో శైలేష్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో శైలేష్ ఇంట్లో లేడు కానీ అతడి కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. మెలాజీ కుటుంబసభ్యులపై శైలేష్ ఫ్యామిలీ కర్రలతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో మెలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి కుమారుడు నవదీప్ తలకు బలమైన గాయం అయింది. ప్రస్తుతం అతడు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీఎస్‌ఎఫ్ జవాన్ భార్య మంజులాబెన్.. చక్లాసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.