Ramoji rao attends modi meeting: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను విజయవంతం చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. ఈనాడు దినపత్రిక ద్వారా స్వాతంత్ర్య ఉద్యమం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సహా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని మరుగునపడిన సమరయోధులపై ప్రత్యేక కథనాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఈనాడులో ప్రత్యేక బృందం పనిచేస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15న మొదలైన ఈ కథనాలు వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు కొనసాగిస్తామని వివరించారు. ప్రతిరోజు ఓ కొత్త కథనం ద్వారా పాఠకులకు భిన్నమైన విషయాలను చెబుతున్నట్టు తెలిపారు. భావితరాల కోసం ఏడాదిపాటు ప్రచురించిన కథనాలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో పుస్తకాలను ప్రచురిస్తామని రామోజీరావు వివరించారు. ఇదే సమయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలో అంతరించిపోయే దశలో కళలు, హస్తకళల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని రామోజీరావు కోరారు.
"ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకొని ఒక సూచనను ప్రతిపాదిస్తున్నాను. కళలు, చేతివృత్తులు, సంస్కృతిపరంగా భారతదేశం ఎంతటి మహోన్నతమైనదో మనకు తెలుసు. కానీ కాలక్రమేణా ఆయా కళలు, చేతివృత్తులు, చేనేతలు క్రమంగా అంతరించి పోతున్నాయి. ఆయా రంగాలు చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయి. వాటిని సజీవంగా ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఈ సందర్బంగా ఆలోచించాలని మనవి. తద్వారా ఎంతో ఉన్నతమైన భారత సంస్కృతి, కళలు, చేనేతలను యావత్ ప్రపంచానికి తెలియజేయవచ్చు."
-రామోజీరావు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్
75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా దేశంలోని ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశం నిర్వహించారు. 75వ స్వాతంత్ర్య వేడుకల నిర్వహణ కోసం ప్రధాని నేతృత్వంలో గతంలో జాతీయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు, అధికారులు, మీడియాసంస్థల అధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, కళాకారులు, సినీ రంగాలకు చెందిన ప్రముఖులకు స్థానం కల్పించారు. జాతీయ కమిటీ సభ్యులతో మోదీ ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొనగా పలువురు రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ప్రధానితో సమావేశంలో తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కేంద్రం 'ఆపరేషన్ ఆక్సిజన్'- ప్రతి జిల్లాకు ఒకరు!