పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా భరోసా కల్పిస్తూ చట్టం తీసుకురావాలని మరోమారు డిమాండ్ చేశారు రైతు నేత రాకేశ్ టికాయిత్(Rakesh tikait). రైతుల ఆందోళనలకు శుక్రవారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన కర్షకులకు నివాళులర్పించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దిల్లీలోకి ప్రవేశించేందుకు మీకు అనుమతి లభించిందా? అని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు టికాయిత్. 'మాకు అనుమతి ఎందుకు? ఇది చైనానా? లేక కొరియానా? వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఎందుకు అనుమతి తీసుకోవాలి?' అని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపై ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి త్వరలోనే రైతులతో చర్చిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
నవంబర్ 27న సమావేశమై.. భవిష్యత్తు కార్యాచరణ, ఆందోళనలు, డిమాండ్లపై నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు టికాయిత్. ప్రభుత్వం చర్యలు చేపట్టి ఓ పరిష్కారాన్ని కనుగొన్న తర్వాతే ఆందోళనలు ముగిస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఎంఎస్పీ గురించి మాట్లాడటం లేదన్నారు.
సింఘూ సరిహద్దులో పండగ వాతావరణం..
కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు(Farmers protest) శుక్రవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సింఘూ సరిహద్దులోని(singhu border news) నిరసనల ప్రాంతానికి వందల ట్రాక్టర్లలో తరలివచ్చారు రైతులు. రంగు రంగుల విద్యుత్తు దీపాలు, డీజే బాక్సులతో ట్రాక్టర్లను ముస్తాబు చేసి.. సరిహద్దులకు చేరుకున్నారు. పంజాబీ, హరియాణా పాటలతో హోరెత్తించారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని కేంద్రం ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేసిన రైతులు.. మిఠాయిలు పంచుకుని నృత్యాలు చేశారు. అన్నదాతల డ్యాన్సులు, ఆటపాటలతో సింఘూ సరిహద్దులో పండగ వాతావరణం నెలకొంది.
చిన్నారులు, వృద్ధులు, మహిళలు, పురుషులు ప్రతిఒక్కరు రైతు సంఘాల జెండాలు పట్టుకుని.. 'ఇంక్విలాబ్ జిందాబాద్', ' మజ్దూర్ కిసాన్ ఏక్తా జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. రైతులతోపాటు వారి కుటుంబాల్లోని వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు సహా ఈ వేడుకలకు హాజరయ్యారు.
"ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఇది ఒక పండగ లాంటిది. చాలా రోజుల తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ ప్రత్యేక రోజున ప్రత్యేక అల్పాహారం చేయించాం. జిలేబి, పకోడీ, పాయసం, చోలే పూరీ వంటివి ఉన్నాయి. "
- సరేందర్ సింగ్, రైతు
రైతు నిరసనలకు(Farmers protest latest news) ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఉదయం.. ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు కర్షకులు(singhu border latest news). ఏడాది క్రితం నిరసనల ప్రాంతానికి సైకిళ్లపై, కాలినడకన ఎలా చేరుకున్నామో గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి: ఎంఎస్పీ చట్టం కోసం పార్లమెంటుకు రైతుల ట్రాక్టర్ ర్యాలీ