పార్లమెంటు ఉభయసభల్లో పెగాసస్ వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. దీంతో ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే మరోరోజు వృథాగా పోయింది.
పెద్దలసభలో టీఎంసీ ఆందోళన
రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్య నాయుడు.. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చదివారు.
కేంద్ర ఐటీ మంత్రి చేతిలో నుంచి పేపర్లు లాక్కుని, చించేసిన టీఎంసీ ఎంపీ శంతను సేన్‌పై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఆయన్ను పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు.
ప్రజాస్వామ్యంపై దాడి
శంతను సేన్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యసభ ఛైర్మన్. ఐటీ మంత్రి అశ్వీని వైష్ణవ్ చేతిలోని పత్రాలను లాక్కొని చింపేయడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. సభ సజావుగా పనిచేయడానికి సహకరించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. తద్వారా కరోనాపై వంటి కీలకాంశాలపై మరింత అర్థవంతమైన చర్చలు జరపవచ్చని పేర్కొన్నారు.
"రాజ్యాంగం నిర్దేశించిన విధంగా సభను ముందుకు సాగనిచ్చేలా సభ్యులు ఎందుకు సహకరించడం లేదో అర్థం కావడం లేదు. పార్లమెంటును స్తంభింపజేయడం వల్ల లాభమేమిటి? దీని వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది?" అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు.
సస్పెండ్ చేసినట్టు ప్రకటించినా... శంతను సేన్ సభను వీడకుండా నినాదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆయనకు మద్దతుగా ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. అయినా పరిస్థితిలో మార్పు రాకపోగా సోమవారానికి వాయిదా వేశారు.
నాలుగోరోజూ వాయిదాల పర్వం
లోక్‌సభలోనూ పెగాసస్ వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టగా.. పెగాసస్ అంశాన్ని విపక్షాలు ప్రస్తావించాయి. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించాయి. సహకరించాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మధ్యాహ్నం 12.30 వరకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత వివిధ పార్లమెంటరీ కమిటీల్లో జరిగిన నూతన నియామకాలపై తీర్మానాలను విపక్షాల ఆందోళన మధ్యే ఆమోదించారు. అయితే పెగాసస్‌పై విపక్షాలు పట్టు వీడకపోవడం వల్ల లోక్‌సభను ఈ నెల 26కు(సోమవారం) వాయిదా వేశారు.
ఇదీ చూడండి: టీఎంసీ ఎంపీ శంతనుపై సస్పెన్షన్ వేటు