కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ రాజస్థాన్‌లోని 8 పట్టణాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అజ్మీర్, బిల్వారా, జైపూర్, జోధ్‌పూర్, కోటా, ఉదయ్‌పుర్, సాంగ్వాడా, బంస్వారాలో సోమవారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది.
మార్చి 25 నుంచి రాజస్థాన్ వచ్చే ప్రయాణికులు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు వెంట తీసుకురావాలని రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నెగిటివ్ రిపోర్టు లేకుంటే.. 15రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్‌లు రాత్రి 10 గంటలకు మూసేయాలని ఆదేశించింది. రాజస్థాన్‌లో శనివారం కొత్తగా 445 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3 లక్షల 24 వేల 948మంది కోవిడ్ బారినపడ్డారు.
అక్కడ హోలీ వేడుకలపై నిషేధం..
కరోనా కేసులు పెరుగుతున్నందున గుజరాత్‌లో హోలీ వేడుకలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోలీ పండుగ సందర్భంగా జరుపుకొనే.. 'హోలీ కా దహన్' వేడుకలకు మాత్రం ఆంక్షలతో అనుమతించింది. హోలికా దహన్‌లో.. పరిమిత సంఖ్యలోనే ప్రజలు పాల్గొనాలని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటానికి అనుమతిలేదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గుజరాత్‌లో ఆదివారం కొత్తగా 1,565 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 2 లక్షల 85 వేల 429 మంది కరోనా బారిన పడ్డారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో కరోనా రికార్డు- ఒక్కరోజే 30వేల కేసులు