CM Ashok Gehlot Sacks Minister : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి రాజేంద్రను బర్తరఫ్ చేస్తునట్లు ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై రాజేంద్ర విమర్శలు గుప్పించిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం వెలువడింది. శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను.. అధికారిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఆయన సిఫార్సును గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. రాజేంద్ర హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
శుక్రవారం ఉదయం రాజస్థాన్ అసెంబ్లీలో కనీస ఆదాయ హామీ బిల్లు-2023పై చర్చ జరిగింది. ఇదే తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మణిపుర్ అమానుష ఘటనను నిరసిస్తూ ప్లకార్డ్‌లు ప్రదర్శించారు. ఆ సందర్భంలోనే రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందని అసెంబ్లీలో రాజేంద్ర ప్రశ్నించారు. రాజస్థాన్‌లో మహిళలపై వివక్ష రోజురోజుకు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "రాష్ట్రంలో మహిళకు భద్రత కల్పించడంలో మనం విఫలం అయ్యాం. ఇది నిజం. దీన్ని మనందరం అంగీకరించాలి. మణిపుర్ ఘటనను లేవనెత్తే బదులు.. ముందు మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి". అని రాజస్థాన్ అసెంబ్లీ వేదికగా రాజేంద్ర వ్యాఖ్యానించారు. దీంతో మంత్రివర్గంలో ఉండి ప్రభుత్వాన్నే ప్రశ్నించడంపై మండిపడ్డ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. రాజేంద్రను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
"రాజస్థాన్‌లో సోదరిమణులపై, కూతుళ్లపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(2) ప్రకారం.. మంత్రివర్గం సమిష్టి బాధ్యతతో పనిచేస్తుంది. ఒక మంత్రిని మొత్తం క్యాబినెట్‌గా పరిగణిస్తారు." అని రాష్ట్ర ప్రతిపక్షనేత రాజేంద్ర రాథోడ్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాల పట్టికలో రాజస్థాన్ టాప్ ప్లేస్ ఉండటంపై.. ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. రాష్టంలో శాంతిభద్రతల పతనానికి ముఖ్యమంత్రితో పాటు హోం మంత్రిగానూ ఉన్న గహ్లోత్.. బాధ్యత వహించాలని రాథోడ్ డిమాండ్ చేశారు.
మండిపడ్డ బీజేపీ..
"నిజాన్ని ఒప్పుకునే దైర్యం ముఖ్యమంత్రి గహ్లోత్‌కు లేదు. అసెంబ్లీ రాజేంద్ర నిజాన్ని మాట్లాడారు. అందుకే ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించారు." అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేశారు. మంత్రిగా రాజేంద్రను బర్తరఫ్ చేయడంపై రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ కూడా మండిపడింది. నిజం మాట్లాడినందుకే ముఖ్యమంత్రి ఈ చర్యలు తీసుకున్నారని విమర్శించింది. మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందనే విషయం రాజేంద్ర వ్యాఖ్యల్లోనే వెల్లడైందని పేర్కొంది.