చేతిరాత ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. కొద్ది మంది చేతిరాత మాత్రమే ఒకే విధంగా కనిపిస్తుంది. అయితే.. 300 మందికిపైగా విద్యార్థుల ఒకే విధమైన చేతిరాతతో ఏకంగా వరల్డ్ రికార్డునే సొంతం చేసుకున్నారు. రాజస్థాన్, బాడ్మేర్లోని కలాం ఆశ్రమ విద్యార్థులు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్రను ఆంగ్లంలో రాసి.. 'వరల్డ్స్ గ్రేటెస్ట్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సంపాదించారు.
కలాం ఆశ్రమంలో శుక్రవారం నిర్వహించిన విద్య, ప్రేరణ శిబిరంలో 305 మంది విద్యార్థులు అబ్దుల్ కలాం జీవిత చరిత్రను ఆంగ్లంలో.. ఒకే విధమైన చేతిరాతతో పూర్తి చేశారు. వారికి చేతిరాత నిపుణులు ఓంప్రకాశ్ సివాచ్ కొద్ది రోజులుగా రోజుకు రెండు గంటలు శిక్షణ ఇస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే పలు రికార్డులు సాధించారు ఆశ్రమంలోని విద్యార్థులు. "నేను మొదటిసారి ఈ శిబిరంలో పాల్గొన్నాను. చేతిరాతలో శిక్షణ తీసుకున్నాను. అంతకు ముందు నా చేతిరాత సరిగా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ప్రపంచ రికార్డ్ సృష్టించగలిగాం. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. " అని మాయ అనే విద్యార్థిని తెలిపింది.
చేతిరాతపై శిక్షణ మొదలు పెట్టినప్పుడు ప్రపంచ రికార్డు సాధిస్తామని తమకు తెలియదని మరో విద్యార్థిని విమల తెలిపింది. కానీ, ఇప్పుడు ప్రపంచ రికార్డ్ సాధించటం చాలా ఆనందంగా ఉన్నట్లు పేర్కొంది.
ఆంగ్లం చేతిరాతలో వరల్డ్స్ గ్రేటెస్ట్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కలాం ఆశ్రమానికి చెందిన 305 మంది చోటు దక్కించుకున్నారని శిక్షకుడు ఓంప్రకాశ్ సివాచ్ తెలిపారు. అంతకుముందు 2019లో 303 మంది విద్యార్థులు ఒకే విధమైన చేతి రాతతో గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారని చెప్పారు. 2022, ఫిబ్రవరిలో 304 మంది హార్వర్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించినట్లు వివరించారు.
ఇదీ చూడండి: 153 దేశాల వార్తాపత్రికల సేకరణ.. వరించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు