Rajasthan 100 Private Lockers : దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగడం వల్ల ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రాజస్థాన్ రాజధాని జైపుర్‌లోని ఓ భవనంలో 100 ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనంతో పాటు 50 కిలోల బంగారం దాచి ఉంచారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనా ఆరోపించారు. పోలీసులే వచ్చి వాటిని తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఆరోపణలు సంచలనంగా మారాయి.
100 Private Lockers In Rajasthan : అయితే ఆ లాకర్లు ఎవరికి చెందినవనే వివరాలను మాత్రం కిరోడి లాల్ మీనా బయటపెట్టలేదు. పోలీసులు వచ్చి లాకర్లను తెరిచే వరకు తాను అక్కడే కూర్చొని ఉంటానని ఆయన తెలిపారు. లాకర్లు ఉన్న భవనం వద్దకు తనతో కలిసి రావాలని మీడియా ప్రతినిధులను కోరారు. పోలీసులే వచ్చి ఈ లాకర్లను తెరవాలని డిమాండ్ చేశారు. ఈ లాకర్లు ఎవరివనే వివరాలను ఇప్పుడే బయట పెడితే.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ లాకర్లు తెరవనివ్వరని ఆయన తెలిపారు. జైపుర్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కిరోడిలాల్ మీనా సవాయి మాధోపుర్ నుంచి బరిలో ఉన్నారు.
పోలింగ్ ఎప్పుడంటే?
Rajasthan Election 2023 : అయితే రాజస్థాన్‌లో ఎన్నికల పోలింగ్ తేదీని మార్చుతున్నట్లు ఇటీవలే ఎన్నికల అధికారులు ప్రకటించారు. నవంబరు 23న జరగాల్సిన పోలింగ్‌ను అదే నెల 25వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు. నవంబరు 23వ తేదీన రాజస్థాన్‌లో దేవ్ ఉథాని ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. దీంతో ఓటింగ్‌పై భారీగా ప్రభావం పడుతుందని పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పోలింగ్ తేదీని మార్చాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఎన్నికల సంఘం.. పోలింగ్ డేట్‌ను మార్చుతున్నట్లు ప్రకటించింది.
Rajasthan Election Schedule : రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
- నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 30
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: నవంబర్ 6
- నామినేషన్ల పరిశీలన: నవంబర్ 7
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 9
- రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 25
- రాజస్థాన్ ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
- మొత్తం ఓటర్లు: 5.25 కోట్లు. కౌంటింగ్ యథావిథిగా డిసెంబర్ 3న జరగనున్నట్లు తెలిపారు. ముందు అనుకున్న తేదీన పెద్ద ఎత్తున వివాహాలు ఉండడమే పోలింగ్ తేదీని మార్చామని చెప్పారు.
Rajasthan Elections 2023 : రాజస్థాన్‌లో సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక కాంగ్రెస్‌కే జై కొడతారా?