దేశంలో పలు రాష్ట్రాలు వరదల ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ సహా దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదతోపాటు బురద ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. మరొకొన్ని ప్రదేశాల్లో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షపాతం
మహారాష్ట్రలోని ఠాణె, రాయిగఢ్, పాల్ఘడ్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఠాణెలో ఆదివారం రాత్రి 151.33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. పాల్ఘఢ్ జిల్లాలో 108.67 మిల్లీమీటర్ల, రాయిగఢ్ జిల్లాలో సగటున 186.51మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఠాణెలో వర్షాల ధాటికి ఓ బాలుడు చనిపోగా.. నివాస భవనాలపై చెట్టు విరిగిపడటం వల్ల 40 ఏళ్ల వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు పాల్ఘడ్ జిల్లాలో వాసయి ప్రాంతంలో 80 గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోగా.. వాటిని పోలీసుల సాయంతో సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
ముంబయి నగరంలో వరదల కారణంగా స్థానిక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
రాకపోకలకు అంతరాయం
దేశ రాజధానిలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల వాన నీరు నిలిచిపోయి.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారీ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇళ్లలోకి వరద నీరు
ఉత్తరాఖండ్ తెహ్రీ గఢ్వాల్ జిల్లాలో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. పంటలు ధ్వంసమయ్యాయి. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: హెచ్చరికలు పట్టించుకోకుండా వెళ్లారు.. చివరకు..