Rahul Gandhi Manipur Violence : మణిపుర్లో జరిగిన హింస, దాని వల్ల అక్కడి ప్రజలకు కలిగిన ఇబ్బందుల వల్ల తాను చాలా కలత చెందినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆ హింసను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మణిపుర్ సగానికి నలిగిపోయిందని.. తగిలిన గాయాలు మానడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక రాష్ట్రంలో విభజన, ద్వేషం, కోపంతో కూడిన రాజకీయాలు చేస్తే ఏమవుతుందో.. అదే మణిపుర్ అల్లర్లు అని రాహుల్ అన్నారు. అది తనకొక ఒక పాఠం అని తెలిపారు. కాబట్టి అందరినీ కుటుంబంలా కలిపి చూడడం చాలా ముఖ్యమని అన్నారు. కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. కోడెంచెరిలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ఆడిటోరియంలో కమ్యూనిటీ మేనేజ్మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు వయనాడ్ జిల్లాలోని మనంతవాడి ప్రాంతంలోని నల్లూర్‌నాడ్‌లోని డాక్టర్ అంబేడ్కర్ జిల్లా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్లో హెచ్‌టి కనెక్షన్‌ను రాహుల్ ప్రారంభించారు. అనంతరం బీజేపీ.. గిరిజనులను వనవాసీలని పిలవడం వెనుక 'దిక్కుమాలిన లాజిక్' ఉందని ఆయన ఆరోపించారు. దీనికి అసలు కారణం గిరిజనులు అటవీ భూములకు యజమానులను తిరస్కరించడమేనని.. వారిని అడవికి పరిమితం చేయడమేనని అన్నారు. వనవాసీ అనే పదం ఆదివాసీ వర్గాల చరిత్ర, సంప్రదాయాలను వక్రీకరించడం, దేశంతో వారికి ఉన్న సంబంధాలపై దాడి చేయడమేనని మండిపడ్డారు. అలాంటి సిద్ధాంతాలు తమ పార్టీ (కాంగ్రెస్)లో ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వారు ఆదివాసీలేనన్న రాహుల్.. అటవీ భూములకు వారు నిజమైన యజమానులన్నారు. అందుకే వారికి ఆ భూములపై హక్కులు కల్పించి.. వారు కోరుకున్న ప్రదేశానికి వాళ్లను వెళ్లనివ్వాలని డిమాండ్ చేశారు.
దేశంలోని మిగతా పౌరులకు ఇచ్చినట్లే ఆదివాసీలకు.. విద్య, ఉద్యోగాలు మొదలైన అన్ని అవకాశాలను అందించాలన్నారు. గిరిజనులను పరిమితం చేయకూడదనన్న రాహుల్.. వారిని వర్గీకరించకూడదని చెప్పారు. ఆదివాసీ అంటే నిర్దిష్ట జ్ఞానం అని.. మనం నివసించే భూమితో మనకు ఉండే సంబంధం గురించి అవగాహన అని ఆయన తెలిపారు. ఆధునిక సమాజం అడవులను తగలబెట్టి కాలుష్యానికి కారణమైన తర్వాత.. పర్యావరణ పరిరక్షణ అనే పదాలు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారాయని అన్నారు. కానీ ఆదివాసీలు పర్యావరణ పరిరక్షణ గురించి వేల ఏళ్లుగా మాట్లాడుతున్నారన్నారు. కాబట్టి వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు.
'మణిపుర్లో భరతమాత హత్య.. అందుకే ఆ రాష్ట్ర పర్యటనకు మోదీ దూరం'
'4 నెలలుగా మణిపుర్ తగలబడుతుంటే.. పార్లమెంట్లో మోదీ జోకులా?'